Thursday, July 4, 2024

AP | నూతన ఇసుక పాలసీపై సీఎం సమీక్ష.. కీలక ఆదేశాలు జారీ

ఏపీ సీఎం చంద్రబాబు సచివాలయంలో మంత్రులు, అధికారులతో ఇసుక, రోడ్లు, నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై వరుసగా సమీక్షలు నిర్వహించారు. గత ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలు అనేక సమస్యల్లో ఉన్నారని, వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆయన దిశానిర్దేశం చేశారు.

రాష్ట్రంలో ఇసుక లభ్యత, నూతన ఇసుక పాలసీపై సీఎం సమీక్షించారు. పాలనలో మార్పు స్పష్టంగా కనిపించేలా.. అధికారులు వేగంగా పని చేయాలని అన్నారు. 2014 నుంచి 2019 వరకు ఇసుక సరఫరాలో అమలు చేసిన పాలసీలను, ఆ తరువాత వైసీపీ ప్రభుత్వం తెచ్చిన విధానాలను అధికారులు వివరించారు. 2016లో తెచ్చిన ఉచిత ఇసుక పాలసీ వల్ల వచ్చిన ఫలితాలు… తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం పాలసీలు మార్చడం వల్ల జరిగిన నష్టాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు.

గత ప్రభుత్వ విధానాలతో ఇసుక కొరత, ధరల భారంతో నిర్మాణ రంగం సంక్షోభాన్ని ఎదుర్కొందని అధికారులు వెల్లడించారు. ఇసుక క్వారీల నిర్వహణలో పారదర్శకత లేకపోవడం, ప్రైవేటు వ్యక్తులు, ఏజెన్సీలకు ఇసుక క్వారీలను అప్పగించడంతో సరఫరా, అమ్మకాల్లో ఇబ్బందులు వచ్చాయని తెలిపారు.

సీసీ కెమెరాలు, జీపీఎస్‌ ట్రాకింగ్‌, ఆన్‌లైన్‌ విధానం సరిగా లేకపోవడం వల్ల అక్రమాలు జరిగాయని తెలిపారు. ప్రైవేటు ఏజెన్సీలు ఎంత మేర తవ్వకాలు జరిపాయి, ఎంత మేర అమ్మకాలు జరిపాయనే విషయంలో కూడా ఎలాంటి పరిశీలన, పర్యవేక్షణ జరగలేదని అధికారులు తెలిపారు. తక్షణం నిర్మాణ రంగానికి అవసరమైన ఇసుకను అందుబాటులోకి తేవడానికి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement