ఆరోగ్యశాఖ మీద నేడు సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనలో భాగంగా తీసుకోవాల్సిన చర్యలు.. అమలు చేయాల్సిన కార్యక్రమాల గురించి ఆయన దిశానిర్దేశం చేశారు. ఎన్టీఆర్ ఆరోగ్యసేవ అమలులో లోపాలు ఉండొద్దని, ఆస్పత్రుల్లో వైద్య సదుపాయాలు మెరుగుదలకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రజారోగ్య పరిరక్షణకు కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చారు. వైద్యం విషయంలో ఏ చిన్న నిర్లక్ష్యాన్ని సహించేది లేదని, వైద్య సేవలను సక్రమంగా అందించాలని, మందులను అన్ని వేళలా అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఈ సందర్భంగా 2014-19 ప్రభుత్వ హయాంలో అమలు చేసిన ఎన్టీఆర్ బేబీ కిట్ల పంపిణీని తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారులను ఆదేశించారు. అలాగే ప్రభుత్వం తరపున యాప్ రూపొందించి హెల్త్ కార్డు ద్వారా ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన వ్యక్తికి సంబంధించిన వివరాలు పొందుపరచాలని చంద్రబాబు సూచించారు.
ఆస్పత్రిలో రోగికి అందించే వైద్య సేవలు, పరికరాలు, ఇచ్చే మందుల వివరాలను కూడా యాప్‌లో నమోదు చేయాలని అన్నారు. ఇక రాష్ట్రంలో కిడ్నీ బాధితులు ఎంతమంది ఉన్నారనే దానిపై మండలాల వారీగా వివరాలు సేకరించాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు.
సీటీ స్కాన్ సర్వీసెస్‌ను అన్ని జిల్లా ఆస్పత్రులలో ఏర్పాటు చేయాలని.. రాష్ట్రంలో టీబీ రోగులు ఎంతమంది ఉన్నారనే దానిపై అధ్యయనం చేసి వారికి మందులు అందించాలని ఆదేశించారు. ఫీడర్ అంబులెన్సుకు సాధారణ అంబులెన్సుకు మధ్య అనుసంధానం పెంచాలన్నారు.
డోలీ మోతలు ఇంకా కనబడుతున్నాయని… ఇవి మళ్లీ రిపీట్ అయితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆసుపత్రుల్లో రోగులకు నాణ్యమైన బెడ్ షీట్లు అందించాలని స్పష్టం చేశారు. అలాగే నియోజకవర్గం స్థాయిలో పీపీపీ విధానంలో ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని సీఎం.. ప్రభుత్వమే స్థలం అందిస్తుందని చెప్పారు. దేశంలోనే ఏపీ ఆసుపత్రుల పనితీరు బెస్ట్‌గా ఉండేలా పనిచేయాలని అధికారులకు సూచించారు.