Tuesday, November 26, 2024

ఏపీలో మరో 12 వైద్య కళాశాలలు.. కేంద్రాన్ని కోరిన సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మెడికల్ కళాశాలల ఏర్పాటు చర్యలను ప్రభుత్వం వేగవంతం చేసింది. రాష్ట్రంలో జిల్లాకు ఓ మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తామని ఇటవలే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించారు. ఇప్పటికే మూడు కొత్త మెడికల్ కళాశాలలకు కేంద్రం అనుమతిచ్చింది. ఇంకా 12 మెడికల్ కళాశాలలకు అనుమతి రావల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 12 వైద్య కళాశాలలు ఏర్పాటు చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ విజ్ఞప్తి చేశారు. శనివారం ఆయన కేంద్ర మంత్రితో సుమారు అరగంట పాటు భేటీ అయ్యారు. రాష్ట్రంలో వైద్య కళాశాలల అవసరం, అనుమతుల విషయమై చర్చించారు.  ఈ సందర్భంగా రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు ఆవశ్యకత గురించి వివరిస్తూ కేంద్ర మంత్రికి లేఖ అందజేశారు.

విభజన అనంతరం ఏపీలో అత్యాధునిక వైద్య సదుపాయాల కొరత ఏర్పడి..హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలకు వెళ్లాల్సి వస్తోందని ముఖ్యమంత్రి వివరించారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం ప్రజారోగ్య వ్యవస్థను మెరుగుపర్చేందుకు చేస్తున్న ప్రయత్నాల్ని కేంద్రమంత్రికి వివరించారు. ముఖ్యంగా పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీ, సీహెచ్‌సీ, ఏహెచ్, డీహెచ్‌లు, ప్రాథమిక, ద్వితీయ స్థాయి ఆసుపత్రుల్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. ప్రతి జిల్లాకొక వైద్య కళాశాల ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అత్యాధునిక వైద్యం అందించడం సులభమౌతుందన్నారు. ఏపీలో కొత్తగా 13 జిల్లాల ఏర్పాటుతో మొత్తం 26 జిల్లాలు అయ్యాయి అని సీఎం వివరించారు. కాగా, రాష్ట్రంలో ఇప్పటికే 11 మెడికల్ కళాశాలలున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా పాడేరు, మచిలీపట్నం, పిడుగురాళ్లలో కొత్త మెడికల్ కళాశాలలకు అనుమతిచ్చింది. ఇంకా 12 జిల్లాల్లో మెడికల్ కళాశాలల ఏర్పాటుకు అనుమతివ్వాల్సి ఉంది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement