ఏపీలో ఇళ్లు లేని పేదవారు ఎక్కడా ఉండకూడదని సీఎం జగన్ అన్నారు. గురువారం తన క్యాంప్ ఆఫీసు నుంచి వర్చువల్ విధానంలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణ పనులను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. మొదటి దశలో రూ.28,084 కోట్ల వ్యయంతో 15,60,227 ఇళ్ల నిర్మాణాన్ని ఈ రోజు ప్రారంభించారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో ఒకేసారి 30.76 లక్షల మంది అక్కచెల్లెమ్మల పేరుతో ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తున్నాని సీఎం జగన్ తెలిపారు. ప్రస్తుతం కేవలం రెండు విడతల్లోనే వీరందరికీ పక్కా ఇళ్లు నిర్మించి తీరుతామన్నారు. పేదవారి సొంతిళ్లు కల నిజం చేస్తున్నామన్నారు. పండగ వాతావరణంలో ఇళ్ల నిర్మాణానికి పునాదులు వేస్తున్నామని పేర్కొన్నారు. 175 నియోజకవర్గాల్లో మొదటి దశలో గృహ నిర్మాణాలు చేపడుతున్నామన్నారు. వచ్చే ఏడాది జూన్ 22 కల్లా తొలి దశ గృహ నిర్మాణాల పనులు పూర్తి చేస్తామని, రెండో దశలో రూ.22,860 కోట్లతో 12.70 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపడతామని వెల్లడించారు. రెండు దశలు కలిపి రూ.50,940 కోట్లతో 28.30 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నట్లు వివరించారు. పీఎంఏవైతో అనుసంధానం చేసుకుని గృహ నిర్మాణాలు చేపడుతున్నామని చెప్పారు. 17 వేల వైఎస్‌ఆర్ జగనన్న కాలనీల్లో ఇళ్లు నిర్మిస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు.
31 లక్షల కుటుంబాలకు స్థిరాస్తి ఇవ్వడమే కాకుండా ఇళ్లు కట్టించి ఇస్తున్నామన్నారు. విశాలమైన రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్‌గ్రౌండ్ విద్యుత్, తాగునీరు, ఇంటర్‌నెట్ సౌకర్యాలతో జగనన్న కాలనీలు ఏర్పాటు చేస్తున్నామని సీఎం వివరించారు. వైఎస్‌ఆర్ జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కోసం రూ.32,909 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. 340 చ.అడుగుల ఇంటిలో ఒక బెడ్ రూమ్, హాల్, కిచెన్, బాత్‌రూమ్, వరండా ఏర్పాటు చేయడంతోపాటు రెండు ఫ్యాన్లు, రెండు ట్యూబ్ లైట్లు, 4 బల్బులు, ఒక సింటెక్స్ ట్యాంక్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇళ్లు మంజూరు చేసిన మహిళలకు మూడు అప్షన్లు ఇచ్చామన్నారు. ఎన్నికల సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ప్రకటించిన మేనిఫెస్టోలో ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ అనే హామీని 2023 జూన్ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు.
ఏపీలో అందరికీ ఇళ్లు ఇవ్వాలని భావించినా.. ఆ పని చేయలేకపోతున్నామని సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ ఇళ్లు ఇవ్వాలని తమ ప్రభుత్వం భావిస్తే కొందరు దుర్బుద్దితో కేసులు వేశారని మండిపడ్డారు. అలాంటి కేసులకు భయపడమని.. న్యాయపరంగా వాటిని ఎదుర్కొని పేదలు అందిరికీ గృహ నివాసం కల్పిస్తామన్నారు. ఈ కేసులను పరిష్కరించేందుకు కొంత సమయం పడుతుందన్నారు. కోర్టులు సెలవుల్లో ఉన్నాయని, కోర్టులు తెరిచిన వెంటనే దీన్ని ప్రాధాన్యత అంశంగా తీసుకుని 3.74 లక్షల మంది మహిళలకు న్యాయం చేస్తామని సీఎం జగన్ స్పష్టం చేశారు.