పాడి రైతుల సంక్షేమమే లక్ష్యంగా ఏపీ–అమూల్ పాల వెల్లువ ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం చేపట్టింది. పశ్చిమ గోదావరి జిల్లాలో పాల సేకరణ కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్ శుక్రవారం తన క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ అమూల్ ద్వారా మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించబోతారని అన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో జగనన్న పాల వెల్లువకు శ్రీకారం చుట్టామన్నారు. పాదయాత్రలో పాల రైతుల కష్టాలు చూశానని, లీటర్ పాల ధర కంటే లీటర్ నీళ్ల ధరే ఎక్కువ ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. ఇచ్చిన హామీ మేరకు పాడి రైతుల కోసం అమూల్ ప్రాజెక్ట్‌ను తీసుకొచ్చామన్నారు. అమూల్ సంస్థలో వాటాదారులంతా పాలు పోసే అక్కాచెల్లెమ్మలేనని తెలిపారు. పాలసేకరణలో చెల్లించే ధరలు.. మిగిలిన సంస్థల కంటే అమూల్ సంస్థలో ఎక్కువ అని, అమూల్ ద్వారా పాడిరైతులకు మంచి లాభాలు వస్తున్నాయని చెప్పారు.
ఇప్పటికే చిత్తూరు, ప్రకాశం, గుంటూరు, వైఎస్‌ఆర్ కడప జిల్లాల్లో పాల సేకరణ జరుగుతోందన్నారు. ఇవాళ్టి నుంచి పశ్చిమగోదావరి జిల్లాలోని 153 గ్రామాల్లో అమూల్ సంస్థ పాలసేకరణ చేస్తుందన్నారు. రాష్ట్రంలో 9,899 గ్రామాలకు అమూల్‌ను విస్తరిస్తామని సీఎం వెల్లడించారు. లీటర్‌కు అదనంగా రూ.5 నుంచి రూ.15 వరకు వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చారు. పాడి రైతులకు 10 రోజులకు ఒకేసారి బిల్లు చెల్లింపులు ఉంటాయని సీఎం తెలిపారు.