ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్ర ఉండకూడదని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. సోమవారం ఆయన తాడేపల్లిలోని తాన క్యాంపు కార్యాలయంలో ధాన్యం, ఇతర పంటల కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రైతుకు కనీస ఎంఎస్పీ ధర లభించాలన్నారు. రైతులందరికీ ఎంఎస్పీ రావడం అన్నది మన ప్రభుత్వ లక్ష్యమన్నారు. నాణ్యతా పరిశీలనలో రైతులు మోసాలకు గురికాకూడదని సీఎం చెప్పారు. ఇతర దేశాలకు నేరుగా ప్రభుత్వంనుంచే ఎగుమతులు చేసేలా చూడాలన్న సీఎం.. దీనివల్ల రైతులకు మేలు జరుగుతుందన్నారు.
రైతులకు సేవలందించడంలో ఎలాంటి అలసత్వం ఉండకూడదని సీఎం చెప్పారు. ఎక్కడా కూడా సమాచార లోపం ఉండకూడదన్నారు. తరచుగా రైతులతో ఇంటరాక్ట్ అవ్వాలన్న సీఎం జగన్.. రంగుమారిన, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి గతంలో ఎవ్వరూ ముందుకు వచ్చిన సందర్భాలు లేవన్నారు. రైతులకు తోడుగా నిలవడానికి చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఆ ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. కొనుగోలు చేసిన 21 రోజుల్లో వారికి పేమెంట్లు అందేలా తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం.. దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలని పేమెంట్లు ఆలస్యం కాకుండా చూడాలి ఆదేశించారు.
కొనుగోలు కోసం ఆర్బీకేలో ఐదుగురు సిబ్బంది ఉండాలన్నారు. ధాన్యం, పంటల కొనుగోలు కోసం ప్రతి ఆర్బీకేలో కూడా కనీసంగా ఐదుగురు సిబ్బంది ఉండాలని సూచించారు. టెక్నికల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఇతర సిబ్బంది ముగ్గురు కచ్చితంగా ఉండాలని స్పష్టం చేశారు. ప్రతి ఆర్బీకేలో కూడా కేటగిరీతో సంబంధం లేకుండా ఐదుగురు సిబ్బంది ఉండాలన్నారు. గన్నీ బ్యాగులు, రవాణా వాహనాలు, అవసరమైన హమాలీలను ఈ ఐదుగరు సిబ్బందే ఏర్పాటు చేయాలన్నారు. రైతులు ఇబ్బందులు పడే పరిస్థితులు ఉండకూడదన్నారు.
పంటల కొనుగోలు సంబంధిత సమస్యలపై ఫిర్యాదులు, విజ్ఞాపనల కోసం ప్రతి ఆర్బీకేలో ఒక నంబర్‌ను పెట్టాలని సీఎం సూచించారు. ఆ నంబర్‌కు వచ్చే ఫిర్యాదులను సీరియస్‌గా తీసుకోవాలన్నారు. క్షేత్రస్థాయి పర్యటనలు జరిపి రైతులు చెప్పే సమస్యలను వినాలని సీఎం ఆదేశించారు. దీనివల్ల సమస్యల తీవ్రతతో పాటు పరిష్కార మార్గాలు లభిస్తాయన్న సీఎం.. రైతులతో ఇంటరాక్షన్, నిరంతర చర్చలు అధికారులు జరపాలన్నారు. జిల్లాల్లో ఉన్న జేసీల నుంచి కూడా పంటలకొనుగోలుపై నిరంతర ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని చెప్పారు.
రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుచేసేలా వారిలో అవగాహన కల్పించాలని సీఎం జగన్ సూచించారు. పంటలు పండించే వారికి ప్రత్యేక బోనస్ ఇచ్చే అంశాన్ని అధికారులు పరిశీలించాలన్నారు. ప్రత్యామ్నాయ పంటలు పండించేలా కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రత్యామ్నాయ పంటల కొనుగోలు బాధ్యతను కూడా ప్రభుత్వమే చేపడుతుందన్న విషయాన్ని రైతులకు తెలియజేయాలని చెప్పారు. రైతులకు మంచి ఆదాయాలు కల్పన దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం జగన్ నిర్దేశించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital