Monday, November 18, 2024

చిరు వ్యాపారుల ఖాతాల్లో రూ.10 వేల జమ

చిరువ్యాపారులకు జగనన్న తోడు ద్వారా వడ్డీలేని రుణాలు అందిస్తున్నామని సీఎం జగన్ అన్నారు. జగనన్న తోడు పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 3.70 లక్షల మంది చిరు వ్యాపారుల ఖాతాల్లో రూ.10 వేల చొప్పున రూ.370 కోట్లను ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ చిరు వ్యాపారులకు బ్యాంకులు రుణాలు ఇవ్వట్లేదని అన్నారు. వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు తీసుకుని తీర్చలేని పరిస్థితి ఉందని, వడ్డీలు కట్టలేక అష్టకష్టాలు పడుతున్నారని తెలిపారు.

పాదయాత్రలో చిరు వ్యాపారుల కష్టాలు చూశానని, వారి కోసం జగనన్న తోడు ద్వారా వడ్డీలేని రుణాలు అందిస్తున్నామని తెలిపారు. చిరు వ్యాపారులకు రూ.10 వేల వరకు వడ్డీ లేని రుణం ఇస్తున్నామని పేర్కొన్నారు. గత ఏడాది జగనన్న తోడు ద్వారా 5.35 లక్షల మంది రుణ సౌకర్యం పొందారని సీఎం వైఎస్‌ జగన్‌ గుర్తుచేశారు. రెండో విడతలో 3.7 లక్షల మంది చిరువ్యాపారులకు రూ.370 కోట్ల రుణ సౌకర్యం అందించామని సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. మొత్తం 9 లక్షల 5 వేల మంది చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణం ఇచ్చినట్లు తెలిపారు. గ్రామాలు, పట్టణాల్లో చిరు వ్యాపారాలు చేసుకునేవారికి లబ్ధి చేకూరుతుందన్నారు. అర్హత ఉన్నవారందరికీ సాయం చేస్తున్నామని, సకాలంలో వడ్డీ చెల్లించేవారికి తిరిగి వారి ఖాతాల్లోకే జమ చేస్తామని సీఎం జగన్‌  తెలిపారు.  అర్హత ఉండి రుణం రాకపోతే ఆందోళన అవసరం లేదని, గ్రామ సచివాలయాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు అని సీఎం జగన్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement