దివంగత వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకలను ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ఆధ్వర్యంలో విజయవాడలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తదితరులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో వారు వైఎస్‌తో ఉన్న తమ అనుభవాలను, ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు.
సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘వైఎస్ఆర్ జ్ఞాపకాలు మనకు శాశ్వతం. ఆయనే సంక్షేమ పథకాల సృష్టి కర్త. వైఎస్ఆర్ జ్ఞాపకాలు కాలం గడిచిన కొద్దీ పేదవాళ్ళ గుండెల్లో బల పడుతున్నాయి. ఆయన లేని లోటు మనకు స్పష్టం గా కనిపిస్తుంది. ఇక్కడ పార్టీ బలహీనంగా ఉన్నా అభిమానులకు కొదువ లేదు. వైఎస్ఆర్ తో నాకు భిన్నమైన అభిప్రాయం ఉంది. అప్పట్లో మొదటి సారి శాసనమండలిలో నేను అడుగు పెట్టాను.
అప్పుడు వైఎస్ఆర్ దృష్టిలో పడాలని మండలిలో బలమైన వాదనలు వినిపించే వాడిని. పిల్లవాడు అని కాకుండా వైఎస్ఆర్ ప్రతి అంశానికి సమాధానం చెప్పేవారు. కొత్తగా సభలో వచ్చిన సభ్యులు అవగాహనతో మాట్లాడుతున్నారు అనేవారు. వాళ్లకు మనం అవకాశం ఇవ్వాలని అనేవారు. కొత్త సభ్యులు మాట్లాడుతున్నప్పుడు సభలో కూర్చొనేవారు. ఇదే నాయకుడు లక్ష్యం.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వైఎస్ఆర్ తీరు మనకు ఆదర్శం. ఎవరు వినతి పత్రం ఇచ్చినా…అందరికీ సమయం ఇచ్చే వాడు. ప్రజా దర్బార్ లో అన్ని విజ్ఞప్తులు స్వీకరించేవారు. చేవెళ్ల నుంచి ఇచ్ఛాపురం వరకు 14 వందల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఆనాడు ఏపీలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చారు. ఇప్పుడు అదే స్ఫూర్తితో రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారు. రాహుల్ జోడో యాత్రతో కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో వచ్చింది. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా వచ్చింది. మూడోసారి మోడీ గెలిచినా అది గెలుపు కాదు.
ఇవ్వాళ ఏపిలో షర్మిల అలుపెరుగని పోరాటం చేస్తుంది. 2009 నుంచి ఇప్పటి వరకు షర్మిల ప్రజల మధ్యనే ఉంది. ప్రతిపక్ష హోదా నుంచి 2004 లో కాంగ్రెస్ అధికారంలో వచ్చింది. 1999 స్ఫూర్తిని వైఎస్ షర్మిల ఏపిలో కొనసాగిస్తుంది. ఏపీలో ప్రధాన ప్రతిపక్షం వైఎస్ షర్మిలనే. ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ఇక్కడ బీజేపీ అంటే బాబు, జగన్, పవన్. ఇక్కడ అంతా బీజేపీ పక్షమే.
ప్రజల పక్షం వైఎస్ షర్మిల మాత్రమే. షర్మిల మాత్రమే ప్రజా సమస్యల మీద కొట్లాడుతోంది. 2024లో ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ షర్మిలను చూస్తాం. వైఎస్ఆర్ పేరుతో వ్యాపారం చేసే వాళ్ళు వారసులు కాదు. ఆయన ఆశయాలను కొనసాగించే వాళ్ళే నిజమైన వారసులు. వైఎస్ఆర్ ఆశయాలను కొనసాగించడం కోసమే షర్మిల బాధ్యతలు తీసుకున్నారు.
ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలపడేందుకు మేము అండగా నిలబడతాం. ఇవ్వాళ మంత్రి వర్గాన్ని మొత్తం తీసుకురావడం ఇందుకు నిదర్శనం. షర్మిల ప్రయత్నాలను బలోపేతం చేస్తాం. కడపకు ఉపఎన్నికలు వస్తాయని అంటున్నారు. నిజంగా ఉప ఎన్నికలు వస్తే కడపలో గల్లి గల్లి తిరిగే బాధ్యత నేను తీసుకుంటా. ఎక్కడ పొగుట్టుకున్నామో అక్కడ నుంచే గెలుపు సాధిస్తామని’ రేవంత్ అన్నారు.
కాంగ్రెస్‌లో అలాంటి సీఎం వైఎస్ ఒక్కరే..
ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. ‘వైఎస్ఆర్ ను నేను ఆఖరిగా కలిసినప్పుడు ఒక మాట అన్నాడు. ఏమి కానీ నన్ను దేవుడు ఇంత వాడిని చేశాడు. ఎంతో మంది పేదలకు జీవితం ప్రసాదించే అవకాశం ఇచ్చాడు అని అన్నాడు. జలయజ్ఞం పోర్టు అయితే రాష్ట్ర అభివృద్ధి అదే అన్నారు. 2009 ఎన్నికల ఫలితాల ముందు చాలా టెన్షన్ పడ్డారు. ఓడిపోతే జలయజ్ఞం పరిస్థితి ఏమిటి అని బాధపడ్డారు.
రెండోసారి గెలిచాక మళ్ళీ ప్రజల దగ్గరకు వెళ్ళాలి అనుకున్నారు. ఎన్నికలు అయ్యాక ప్రజల మధ్యకు వెళ్ళాలి అనే తొందర ఎవరికి ఉండదు. కానీ వైఎస్ఆర్ అలా కాదు. పాలనలో పథకాలు అందుతున్నాయా ? లేదా? అని చూడాలి అనుకున్నారు. రెండో సారి గెలవడం వైఎస్ఆర్ పని తీరుకు నిదర్శనం. కాంగ్రెస్ పార్టీతోనే ఈ దేశ అభివృద్ధి అని వైఎస్ఆర్ నమ్మారు. అదే సమయంలో బీజేపీకి వైఎస్ఆర్ బద్ధ వ్యతిరేకి.
బీజేపీ మతతత్వ పార్టీ. అందుకే తన జీవితంలో బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇవ్వాళ వైఎస్ఆర్ వారసుడు అని చెప్పుకొనే వాళ్ళు బీజేపీ అంట కాగుతున్నారు. తెర వెనుక పొత్తులు పెట్టుకొని వైఎస్ఆర్ ఆశయాలను తుంగలో తొక్కారు. బీజేపీ తో పొత్తులు పెట్టుకొనే వారు వైఎస్ఆర్ వారసుడు ఎలా అవుతారు. రాహుల్ గాంధీనీ ప్రధాని కావాలని అనుకున్నారు.
కాని వైఎస్ఆర్ హయాంలో రాహుల్ చాలా చిన్న వాడు. అయినప్పటికీ రాజీవ్ గాంధీ లాగే రాహుల్ ఆలోచనలు ఉన్నాయని గుర్తించారు. ఇవ్వాళ రాహుల్ గాంధీ ఒక పెద్ద నాయకుడు. జోడో యాత్రకు వైఎస్ఆర్ పాదయాత్ర స్ఫూర్తి అని చెప్పడం సంతోషమని’ షర్మిల అన్నారు.