అమరావతి, ఆంధ్రప్రభ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సోమవారం ఢిల్లి వెళ్లనున్నారు.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, హోం మంత్రి అమిత్‌షా, ఇతర కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. అపాయింట్‌మెంట్ కుదిరితే శనివారమే ఢిల్లి వెళ్లాలని నిర్ణయించారు. అయితే భారతీయ జనతా పార్టీ హైకమాండ్ పెద్దలంతా సీట్ల కసరత్తులో ఉండటంతో సోమవారం ఢిల్లి పెద్దలతో భేటీ కావాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఈనెల నాలుగోతేదీన కర్నూలులో లా యూనివర్శిటీ కార్యక్రమాన్ని కూడా వాయిదా వేసుకున్నట్లు చెబుతున్నారు.. మరి కొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలకానుంది. దీంతో ఈ లోగా రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం అంశాల అమలతో పాటు రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణలపై ప్రధానికి వివరించే యోచనలో ఉన్నట్లు తెలిసింది.
ప్రధానంగా పోలవరం డీపీఆర్ -2 ఆమోదం.. సవరించిన అంచనాలను ఆమోదించటంతో పాటు తగిన నిధుల విడుదల చేయాల్సిందిగా కేంద్రంపై ఒత్తిడి తేనున్నారు. దీంతో పాటు విభజన హామీల్లో భాగంగా ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించనున్నారు. ప్రత్యేక హోదాపై విభజన సందర్భంగా నాటి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ ప్రకటించినా ఆర్థిక సం ఘానికి నివేదించి చట్టబద్దత కల్పించే విషయంలో ప్రతిపక్ష పార్టీలు చొరవచూపలేదనే వాదనలు ఉన్నాయి.. సభాముఖంగా ఇచ్చిన హామీ (ఫ్లోర్ అస్యూరెన్స్)గానే హోదా మిగిలిపోయే పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. విభజనానంతరం 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ కానీ, రాష్ట్రాన్ని విభజించిన కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ అప్పట్లో ఈ అంశాన్ని కనీసం అస్యూరెన్స్ కమిటీలో సైతం చేర్చలేకపోయారనే వాదనలు లేకపోలేదు.
ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదాపై గత ఐదేళ్లుగా ముఖ్యమంత్రి జగన్ కేంద్రానికి పదేపదే విజ్ఞాపనలు సమర్పిస్తున్నారు.. కనీసం బుందేల్‌ఖండ్ తరహాలో వెసులుబాటు కల్పించాలని ప్రతిపాదనలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే గత ఐదేళ్లుగా కేంద్రానికి అంశాల వారీ మద్దతిస్తున్నట్లు చెబుతున్నారు.. ప్రత్యేక హోదా సాధన, ఇచ్చే విషయంలో నాటి కాంగ్రెస్ పార్టీ విఫలమైన నేపథ్యంలో కేంద్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీయేను ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఏడాది ఎన్నికలతో పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను ప్రకటించిన గడువు పూర్తికానుంది.. ఈ పరిస్థితుల్లో తెలంగాణ జెన్‌కో నుంచి రావాల్సిన 8 వేల కోట్ల బకాయిలపై చర్యలు తీసుకోవాలని మరోవిడత కేంద్రమంత్రులను కోరనున్నట్లు సమాచారం.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో కేంద్రం గత కొంత కాలంగా ఒకింత వెసులుబాటు కల్పిస్తున్నప్పటికీ రాష్ట్ర అవసరాలకు తగ్గట్టుగా నిధులు మంజూరు కావటంలేదని స్పష్టమవుతోంది. పన్నుల్లో వాటా , ఎఫ్‌ఆర్ బీఎం పరిమితిని పెంచే విషయాలు కూడా కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్రంలో విద్యా, వైద్య రంగాలకు ముఖ్యమంత్రి జగన్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.. ఆరోగ్యశ్రీ పరిమితిని 25 లక్షలకు పెంచి సేవలను విస్తృతం చేయటంతో పాటు జగనన్న సురక్ష, ఫ్రెండ్లీ డాక్టర్ కాన్సెప్ట్‌ను అమలు చేస్తున్నారు. కార్పొరేట్ వైద్య సేవలకు ధీటుగా పేదలకు వైద్యం అందించేందుకు కొత్త మెడికల్ కళాశాలలకై కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. కొన్ని పెండింగ్‌లో ఉన్నందున వాటికి అనుమతులు సాధించే దిశగా ఢిల్లి పర్యటన సందర్భంగా కేంద్రాన్ని ఒప్పించాలనే భావనతో ఉన్నట్లు తెలిసింది.
ఇక విశాఖపట్నం మెట్రో రైల్ కారిడార్‌తో పాటు భోగాపురంలో అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం, తీరంలో పోర్టుల నిర్మాణం, విశాఖపట్నం- చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ (వీసీఐసీ), బెంగుళూరు – చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ (బీసీఐసీ)కి చేసిన ప్రతిపాదనలు అమలుపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో చర్చించనున్నట్లు తెలియవచ్చింది. ఇంకా కడప స్టీల్ ప్లాంట్, మూడు రాజధానుల అంశాలను ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా రాష్ట్రంలో గత కొద్దిరోజులుగా చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై కూడా ప్రధాని మోడీ, అమిత్‌షాకు వివరించనున్నట్లు సమాచారం. ప్రతిపక్షాలతో బీజేపీ పొత్తుల ప్రచారం.. అధికారంలోకి వస్తే భవిష్యత్తులో యథాతథంగా అంశాలవారీగా పరస్పర సహకారంతో రాష్ట్ర ప్రయోజనాలను నెరవేర్చుకునే దిశగా ఈ సమావేశం ఉంటుందని తెలిసింది.