న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చ జరిపారు. ఆదివారం జరిగిన నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశానికి ఆయన హాజరయ్యారు. నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో కలిసి సీఎం జగన్ భోజనం చేశారు.
ఆ టేబుల్‌పై ప్రధాని మోదీ, ఏపీ సీఎం జగన్‌తో పాటు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ, మరో ఇద్దరు లెఫ్టినెంట్ గవర్నర్లు కూర్చున్నారు. దాదాపు గంటపాటు సాగిన ఈ లంచ్ భేటీలో దేశంలోని అనేకాంశాలపై చర్చ జరిగినట్టు తెలిసింది. ప్రధానితో సీఎం జగన్ కలిసి కూర్చుని భోజనం చేయడం యాదృశ్చికమేమీ కాదు. సీటింగ్ దగ్గర నుంచి ప్రధానితో ఎవరెవరు విందులో పాల్గొంటారనేది టేబుళ్లవారీగా ప్రొటోకాల్ సిబ్బంది ముందుగానే నిర్ణయిస్తారు. అంతసేపు ప్రధానితో జగన్ ఏం చర్చించారనేది ఆసక్తికరంగా మారింది.