Saturday, November 23, 2024

ఏపీలో కొత్త జిల్లాల‌పై జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం.. ఉగాది నుంచే పాలన ప్రారంభం..

ఏపీలో ఉగాది నుంచి కొత్త జిల్లాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉగాది నుంచే కలెక్టర్లు, ఎస్పీలు కార్యకలాపాలు ప్రారంభించాలని సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి సన్నాహకాలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుత కలెక్టర్లు, ఎస్పీలనే కొత్త జిల్లాలకు పంపాలని స్పష్టం చేశారు. వారి అనుభవం కొత్త జిల్లాలకు ఉపయోగపడుతుందని తెలిపారు. కొత్త జిల్లాలపై తుది నోటిఫికేషన్ వచ్చిన రోజు నుంచే పాలన కొనసాగుతుందని వెల్లడించారు. క్యాంప్ ఆఫీసులో జరిగిన సమీక్షలో కొత్త జిల్లాల ప్రతిపాదనలు, ప్రాతిపదికలను అధికారులు ముఖ్యమంత్రి సీఎం జగన్‌కు వివరించారు. కొత్తజిల్లాల మ్యాపులు, జిల్లా కేంద్రాల నిర్ణయం వెనుక తీసుకున్న ప్రాధాన్యతలను వివరించారు.

అయితే ప్రతిపాదనలపై వస్తున్న అభ్యంతరాలు, సలహాలు, సూచనలు కూడా నిశితంగా పరిశీలించాల‌ని అన్నారు సీఎం జగన్. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత యంత్రాంగం అంతా సమర్థవంతంగా పనిచేయాలన్నారు. కొత్త జిల్లాలో పని ప్రారంభమైన తర్వాత ఎలాంటి అయోమయం ఉండకూడదని, పాలన సాఫీగా ముందుకు సాగాలని.. దీనికోసం సన్నాహకాలను చురుగ్గా, వేగంగా, సమర్థవంతంగా మొదలు పెట్టాలని అన్నారు. ఉగాది నాటికి కొత్త జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ఆయా జిల్లాకేంద్రాల నుంచి పనిచేయాలని సూచించారు. ఉద్యోగుల విభజన, మౌలిక సదుపాయాల ఏర్పాటు, కొత్త భవనాలు వచ్చేలోగా యంత్రాంగం పనిచేయడానికి అవసరమైన భవనాల గుర్తింపు అన్నిరకాలుగా కూడా సిద్ధం కావాలని తెలిపారు. కొత్తగా మౌలిక సదుపాయాలు ఏర్పాటయ్యేలోగా ప్రత్యామ్నాయంగా ఏర్పాటు కావాల్సిన భవనాలు తదితర వాటిని గుర్తించాలని అన్నారు.

అలాగే కొత్త భవనాల నిర్మాణంపైనా ప్రణాళికలను ఖరారు చేయాలని.. అందుకోసం స్థలాల గుర్తింపుపై దృష్టిపెట్టాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. అభ్యంతరాల విషయంలో హేతుబద్ధత ఉన్నప్పుడు దానిపై నిశిత పరిశీలన చేయాలని సూచించారు. నిర్ణయం తీసుకునేముందు వారితో మాట్లాడ్డం అన్నది చాలా ముఖ్యమని తెలిపారు. దీనికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు.
ఏపీలోని 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజిస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసింది జగన్ ప్రభుత్వం. 26 జిల్లాలతో గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన ప్రభుత్వం.. ప్రజలు, ప్రజా సంఘాల నుంచి ప్రజాభిప్రాయం కోరుతోంది. ఫిబ్రవరి 26వ తేదీ వరకు ఎవరైనా తమ అభిప్రాయాలు చెప్పొచ్చని తెలిపింది.

వచ్చే ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలన మొదలుకాబోతోందని ప్రభుత్వం ప్రకటించింది. 18 లక్షల నుంచి 20 లక్షల జనాభాతో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. కొత్త జిల్లాలతో పాటు కొత్తగా మరో 15 రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేసింది. ఏపీలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఇప్పుడున్న 13 జిల్లాలతో పాటు కొత్తగా మరో 13 జిల్లాలు ఏర్పాటు కాబోతున్నాయి.

విశాఖ జిల్లాను విభజించి అనకాపల్లి జిల్లా, పార్వతీపురం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లాలు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో కొత్తగా కాకినాడ జిల్లా, కోనసీమ జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలో కొత్తగా ఏలూరు జిల్లా రాబోతోంది. కృష్ణా జిల్లాలోని నియోజకవర్గాలను విడదీసి ఎన్టీఆర్‌ జిల్లా ఏర్పాటు చేస్తున్నారు. గుంటూరు జిల్లా నుంచి పల్నాడు జిల్లాలు రాబోతున్నాయి. చిత్తూరు జిల్లాను విభజించి శ్రీ బాలాజీ జిల్లా, అన్నమయ్య జిల్లా ఏర్పాటు చేస్తున్నారు. తిరుపతి కేంద్రంగా కొత్తగా బాలాజీ జిల్లా ఏర్పాటు కాబోతోంది. కడప జిల్లాను రెండుగా విభజించి నంద్యాల జిల్లా ప్రతిపాదన తీసుకొచ్చారు. అనంతపురం జిల్లాలో ఇకపై శ్రీసత్యసాయి జిల్లా కూడా కనిపించబోతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement