ఒకరు వెన్నుపోటు వీరుడు.. మరొకరు ప్యాకేజీ శూరుడు అని చంద్రబాబు, పవన్ కల్యాణ్ ల పై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు డెయిరీ దగ్గర అమూల్ ప్రాజెక్టుకు సీఎం జగన్ ఈరోజు భూమి పూజ చేశారు. అనంతరం చిత్తూరు పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో ఫొటో సేషన్, ఎగ్జిబిషన్ పరిశీలించారు. తర్వాత అక్కడ జరిగిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ…
హెరిటేజ్ డెయిరీ కోసం చిత్తూరు డెయిరీని కుట్రపూరితంగా మూసేశారని ఏపీ సీఎం జగన్ ఆరోపించారు. సహకార రంగంలోని చిత్తూరు డెయిరీ నష్టాల్లోకి వెళ్తుంటే.. చంద్రబాబు ప్రైవేట్ డెయిరీ హెరిటేజ్ లాభాలు పెరుగుతూ రావడం ఆశ్చర్యం కలిగించిన విషయమని చెప్పారు. చిత్తూరు డైయిరీ ద్వారా ఒకప్పుడు పాడి రైతుల ముఖాల్లో చిరునవ్వు కనిపించేది అన్నారు. చిత్తూరు డెయిరీని 2002లో కుట్రపూరితంగా మూసేశారని.. తన పాదయాత్ర సమయంలో ప్రజలు చెప్పిన మాటలు ఇంకా గుర్తు ఉన్నాయని చెప్పారు. చిత్తూరు డెయిరీపై చంద్రబాబు కళ్లు పడ్డాయని విమర్శించారు. 1992 చంద్రబాబు సొంత డెయిరీ హెరిటేజ్ పురుడు పోసుకున్న తర్వాత.. ఒక పద్దతి ప్రకారం సహకార రంగంలోని అత్తిపెద్ద చిత్తూరు డెయిరీని నష్టాల్లో నెట్టివేస్తూ వచ్చారని విమర్శించారు.
సహకార రంగంలోని చిత్తూరు డెయిరీ నష్టాల్లోకి వెళ్తుంటే.. చంద్రబాబు ప్రైవేట్ డెయిరీ హెరిటేజ్ లాభాలు పెరుగుతూ వచ్చాయని అన్నారు. హెరిటేజ్ వచ్చే సమయానికి రెండు నుంచి మూడు లక్షల లీటర్లు ప్రాసెస్ చేస్తున్న చిత్తూరు డెయిరీని.. సరిగా పదేళ్లలో ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే కుట్రపూరితంగా మూసేశారని విమర్శించారు. మూతపడిన చిత్తూరు డెయిరీని తెరిపించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు.. రూ. 182 కోట్ల బకాయిలను తీర్చి డెయిరీని రీఓపెన్ చేస్తున్నామని చెప్పారు. అమూల్ రూ. 350 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిందని అన్నారు. 10 లక్షల లీటర్ల పాలను ప్రాసెస్ చేసే స్థాయిలో డెయిరీ ఉంటుందని చెప్పారు. ఈ డెయిరీతో చిత్తూరు జిల్లాలో రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు. రూ. 150 కోట్లతో తొలి దశ పనులు ప్రారంభమవుతాయని చెప్పారు.
10 నెలల్లోనే పాల ప్రాసెసింగ్ మొదలవుతుందని తెలిపారు. చిత్తూరు డెయిరీతో ప్రత్యక్షంగా 5 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. అమూల్ ఔట్ లెట్స్, డిస్ట్రిబ్యూషన్ చానల్స్‌తో పరోక్షంగా 2 లక్షల మందికి పరోక్షంగా ఉద్యోగాలు వస్తాయని అన్నారు. అమూల్ రాకతో మిగిలిన డెయిరీలకు కూడా జ్వరం వచ్చిందని అన్నారు. వాళ్లు కూడా పాలకు రేటు పెంచే పరిస్థితి వచ్చిందని చెప్పారు. అప్పట్లో సీఎంగా ఉన్న స్వలాభం కోసం ఎవరినైనా బలిపెడతారని.. నీతిమాలిన రాజకీయ నాయకుడి కథ ఇది అని విమర్శించారు. చంద్రబాబు మంచిని నమ్ముకోకుండా మోసాన్ని నమ్ముకున్నారన్నారు. చంద్రబాబు మోసాన్ని దత్తపుత్రుడు బలపరుస్తున్నాడన్నారు.