Wednesday, November 20, 2024

తెలంగాణ అక్ర‌మ ప్రాజెక్టులు ఆపండి: కేంద్రానికి సీఎం జ‌గ‌న్ మరో లేఖ‌

తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం మరింత ముదురుతోంది. నీటి అంశంపై ఇరు రాష్ట్రాల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండగా… తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకుంటున్నాయి. కృష్ణా ట్రైబ్యునల్‌ నిబంధనలకు లోబడే శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్‌ కేంద్రం ద్వారా విద్యుదుత్పత్తి చేస్తున్నామ‌ని తెలంగాణ చెబుతుండ‌గా, నీటి వినియోగంపై తెలంగాణ తీరును ఏపీ తప్పుబడుతోంది. రాయలసీమ ఎత్తిపోతలను ఆపాలంటూ తెలంగాణ, తమ వాట కింద హక్కుగా ఉన్న నీటి వాడుకుంటామని ఏపీ.. ఇలా పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. ఇప్ప‌టికే ప్రధాన మంత్రి మోదీ, కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌కు ఏపీ జగన్ లేఖలు రాశారు. తాజాగా సోమవారం తెలంగాణ ప్ర‌భుత్వంపై ఫిర్యాదు చేస్తూ కేంద్రమంత్రులు గజేంద్ర షెకావత్‌, ప్రకాష్‌ జవదేకర్‌కు లేఖ రాశారు సీఎం జగన్.

తెలంగాణ‌లోని అక్ర‌మ ప్రాజెక్టుల‌ను తొలుత సంద‌ర్శించాలని, ఆ త‌ర్వాతే రాయ‌ల‌సీమ లిఫ్ట్ సంద‌ర్శించాలని లేఖలో సీఎం కోరారు. తెలంగాణ ప్రాజెక్టుల‌ను ముందు ప‌రిశీలించేలా కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)ని ఆదేశించాలని ఆయ‌న జల్ శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ను విజ్ఞప్తి చేశారు. కేఆర్ఎంబీ సూచ‌న‌ల‌ను తెలంగాణ ప‌దేప‌దే ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. తెలంగాణ వైఖ‌రితో ఆంధ్ర‌ప్ర‌దేశ్ త‌న వాటా జ‌లాల‌ను కోల్పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ తీరుతో కృష్ణా జ‌లాలు అన‌వ‌స‌రంగా స‌ముద్రంలో క‌లిసి పోతున్నాయని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ ప్రయోజనాలు దెబ్బతినేలా తెలంగాణ వ్యవహరిస్తోందని తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టులో నీటినిల్వలు ఉండకుండా తెలంగాణ అక్రమంగా నీటిని తోడేస్తోందని ఆరోపించారు. ఈ నెల 1 నుంచి ఇప్పటి వరకు 19 టీఎంసీల నీటిని వినియోగించుకుందన్నారు. 796 అడుగుల నీటిమట్టం నుంచి తెలంగాణ నీటిని తోడేస్తోందని సీఎం లేఖలో పేర్కొన్నారు.

శ్రీశైలంలో 854 అడుగుల నీరు లేకుంటే కరువు ప్రాంతమైన రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సాగునీరు అందించే అవకాశం లేదని వివరించారు. పాలమూరు రంగారెడ్డి, దిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను 800 అడుగుల వద్ద పర్యావరణ అనుమతి లేకుండా తెలంగాణ నిర్మిస్తోందని తెలిపారు. ఈ అక్రమ ప్రాజెక్టు వల్ల శ్రీశైలంలో 854 అడుగుల నీరు ఉండే అవకాశాలు లేవని సీఎం  జగన్‌ లేఖలో పేర్కొన్నారు.

రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌కు పర్యావరణ అనుమతి ఇవ్వాలని కేంద్రమంత్రి ప్రకాష్‌ జవదేకర్‌కు రాసిన లేఖలో  సీఎం వైఎస్‌ జగన్‌ విజ్ఞప్తి చేశారు. కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డ్‌ నిబంధనలకు విరుద్ధంగా కృష్ణా ప్రాజెక్టుల్లో తెలంగాణ విద్యుదుత్పత్తి చేస్తోందని ఆరోపించారు. జూన్‌ 1 నుంచి విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతోందన్నారు. నాగార్జునసాగర్‌, కృష్ణా డెల్టా పరిధిలో ఇరిగేషన్‌ అవసరాలు లేకుండా తెలంగాణ నీటిని వినియోగిస్తోందని తెలిపారు. విద్యుత్‌ ఉత్పత్తి కోసమే ఇప్పటి వరకు 19 టీఎంసీల నీటిని వినియోగించిందని, ప్రాజెక్ట్ లో 854 అడుగులకు చేరితే గానీ పోతిరెడ్డిపాడుకు నీటిని తీసుకునే అవకాశం లేదని లేఖలో సీఎం జగన్‌ వివరించారు.   ఇదిలా ఉంటే.. రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్‌ అక్రమ ప్రాజెక్టేని, ఈ నెల 9న నిర్వహించబోయే కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశాన్ని రద్దు చేయాలని, ఈ నెల 20 తర్వాత పూర్తి స్థాయి బోర్డు సమావేశం ఏర్పాటు చేయాలని ఇప్ప‌టికే తెలంగాణ ప్ర‌భుత్వం కోరింది. తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ విజ్ఞ‌ప్తుల‌పై కేంద్ర ప్ర‌భుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.  

ఇది కూడా చదవండి: పాదయాత్ర ఫార్ములా వర్క్ ఔట్ అయ్యేనా?

Advertisement

తాజా వార్తలు

Advertisement