Saturday, November 23, 2024

ఒకేసారి వడ్డీ రాయితీ, ఇన్‌పుట్‌ సబ్సిడీ.. 28న బటన్‌ నొక్కనున్న సీఎం జగన్‌

అమరావతి, ఆంధ్రప్రభ: పంట నష్టపరిహారం రూపంలో ఇన్‌ పుట్‌ సబ్సిడీతో పాటు సున్నా వడ్డీ రాయితీని కూడా ఒకేసారి రైతులకు చెల్లించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 28న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి కంప్యూటర్‌ బటన్‌ నొక్కి లబ్ధిదారులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమచేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ ఏడాది (2022) ఖరీఫ్‌ సీజన్‌లో గోదావరి వరదల రూపంలో ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ రైతులు పంటను కోల్పోయారు. గోదావరి వరదల తరువాత అకాల వర్షాలతో అనేక చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. ప్రత్యేకించి ఖరీఫ్‌ సీజన్‌ ముమ్మరంగా కొనసాగిన సెప్టెంబర్‌, అక్టోబక్‌ నెలల్లో ప్రకృతి వైపరీత్యాలు సంభవించటంతో రైతులు పెట్టుబడి కోల్పోయారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ఎన్యుమరేషన్‌ పేరుతో పంట నష్టాలను వ్యవసాయాధికారుల బృందం క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక అందించింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 45,998 మంది రైతులు 60,832 ఎకరాల్లో పంటను పాక్షికంగా, పూర్తిగా కోల్పోయినట్టు గుర్తించారు. 20 జిల్లాల్లో 21799 మంది రైతులు 34,292 ఎకరాల్లో వ్యవసాయ పంటలనూ, 14 జిల్లాల్లో 24,199 మంది రైతులు 26,540 ఎకరాల్లో ఉద్యాన పంటల్లో నష్టాలను ఎదుర్కొన్నారు.

నష్టపోయిన వ్యవసాయ పంటల్లో వరి, పత్తి, వేరుశెనగ ప్రధానంగా ఉండగా ఉద్యాన పంటల్లో ఉల్లి, మిరప తోటలు ఉన్నాయి. దెబ్బతిన్న పంటలపై సూక్ష్మస్థాయిలో అధికారులు నిర్దిష్టమైన నివేదిక రూపొందించారు. ఈ నేపథ్యంలో 2022 ఖరీఫ్‌ లో పంటలు కోల్పోయిన మొత్తం 45998 మంది రైతులకు రూ 39.39 కోట్లను ఇన్‌ పుట్‌ సబ్సిడీ రూపంలో ప్రభుత్వం నష్టపరిహారం అందించనుంది. గడిచిన మూడేళ్లలో క్రమం తప్పకుండా వరదలు, అకాల వర్షాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు కోల్పోయిన 20.85 లక్షల మందికి రూ 1795 కోట్లను అందించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. 2019-20లో రూ 116.63 కోట్లు, 2020-21లో రూ 932.07 కోట్లు, 2021-22లో రూ 564 కోట్లు అందించినట్టు వెల్లడించింది.

సున్నా వడ్డీ రూ 160.55 కోట్లు

- Advertisement -

పంట నష్టపరిహారంతో పాటు సున్నా వడ్డీ రాయితీని కూడా ఈనెల 28న ప్రభుత్వం రైతులకు అందించనుంది. 2020-21 రబీ, 2021 ఖరీఫ్‌లకు గాను రెండు సీజన్లకు కలిపి ఒకేసారి వడ్డీ రాయితీని అర్హులైన రైతులకు అందించేందుకు జాబితా సిద్ధమైంది. 2020-21 రబీలో 2.54 లక్షల మంది రైతులకు రూ 45.22 కోట్లు, 2021 ఖరీఫ్‌ సీజన్‌ లో 5.68 లక్షల మందికి రూ.115.53 కోట్లు.. మొత్తం 8.22 లక్షల మందికి రూ.160.55 కోట్లను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయనుంది.. బ్యాంకుల వద్ద రూ.1 లక్ష లోపు పంట రుణాలు తీసుకుని నిర్దేశించిన గడువులోపు చెల్లించిన రైతులందరికీ సున్నా వడ్డీ రాయితీ వర్తించనుంది. సున్నా వడ్డీ రాయితీలో పాటు పంట నష్టపరిహారం కూడా కలుపుకుని రూ.199.94 కోట్లను రైతులకు అందించనున్నట్టు అధికారవర్గాలు వెల్లడించాయి. పంట నష్టపరిహారంతో పాటు సున్నా వడ్డీ లబ్దిదారుల జాబితాలను జిల్లాల వారీగా అన్ని రైతు భరోసా కేంద్రాల్లో (ఆర్బీకే) అందుబాటులో ఉంచారు. తమకు అర్హత ఉన్నప్పటికీ లబ్దిదారుల జాబితాలో తమ పేర్లు లేవని భావించిన రైతులు అవసరమైన పత్రాలను దాఖలు చేసుకుంటే పరిశీలించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement