అమరావతి, ఆంధ్రప్రభ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళ, బుధ వారాల్లో తిరుమలతో పాటు నంధ్యాల జిల్లాలో పర్యటించనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీవారికి ప్రభుత్వం తరుపున నేడు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఇందులో భాగంగా మంగళవారం మధ్యాహ్నం 3.45 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరి సాయంత్రం 5.20 గంటలకు తిరుపతి గంగమ్మ తల్లి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. ఆ తర్వాత అలిపిరి చేరుకుని తిరుమలకు విద్యుత్ బస్సులను ప్రారంభిస్తారు.
రాత్రి 7.45 గంటలకు తిరుమలలో బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకుని అక్కడి నుంచి బయలుదేరి శ్రీవారికి పట్టు-వస్త్రాలు సమర్పించి రాత్రికి అక్కడే బస చేస్తారు. మరుసటి రోజు ఈనెల 28న ఉదయం 6.05 గంటలకు స్వామివారిని దర్శించుకున్న అనంతరం నూతనంగా నిర్మించిన పరకామణి భవనాన్ని ప్రారంభిస్తారు. 7.10 గంటలకు టీటీడీ కోసం వైఎస్సార్‌సీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిర్మించిన లక్ష్మీ వీపీఆర్ రెస్ట్ హౌస్‌ను ప్రారంభిస్తారు. 9.55 గంటలకు రేణిగుంట ఎయిర్‌పోర్ట్ నుంచి ఓర్వకల్ బయలుదేరుతారు. 10.55 గంటలకు నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల చేరుకుని రామ్‌కో సిమెంట్స్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1.05 గంటలకు ఓర్వకల్ ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరి 2.20 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.