Saturday, November 23, 2024

AP | కౌంటర్‌ అటాక్ ! సీఎం జగన్‌, పార్టీని టార్గెట్‌చేస్తే ఎదురుదాడే.. ఆమేరకు సీనియర్లకు బాధ్యతలు

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. విపక్షాలన్నీ ఏకమై అధికార వైకాపాపై ఎదురుదాడికి దిగుతున్నాయి. ఈక్రమంలో ఇప్పటికే ప్రతిపక్షాల విమర్శలకు గట్టి కౌంటర్‌ ఇవ్వాలని ఆదేశించిన సీఎం జగన్‌, తాజాగా జనసేనాని పవన్‌, తెదేపా అధినేత చంద్రబాబు, బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలను సీరియస్‌గా తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఈక్రమంలోనే ఎన్నికల సమయానికి ప్రతిపక్షాల మాటల దాడి పెరిగే అవకాశం ఉందని వైసీపీ అధినేత భావిస్తున్నారు. దీంతో.. ప్రతిపక్షాల విమర్శలను ఎప్పటికప్పుడు అదే తరహాలో తిప్పి కొట్టటానికి ఒక టీంను సిద్దం చేస్తోంది. పార్టీ పరంగా సీనియర్లు, వాగ్ధాటి ఉన్న నేతలను ఎంపిక చేస్తున్నారు.

మరీ ముఖ్యంగా రాష్ట్రస్థాయిలో గట్టి కౌంటర్‌ అటాక్‌ ఇచ్చే విధంగా కొంత మంది నేతలను ఇప్పటికే ఎంపిక చేశారు. వీరిలో పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి, మంత్రులు బొత్సా సత్యనారాయణ, అంబటి రాంబాబు, ఆర్కే రోజా, జోగి రమేష్‌, విడదల రజని, మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, డా. పోలుబోయిన అనిల్‌ కుమార్‌ యాదవ్‌, ఎమ్మెల్యేలు భూమన కరుణాకర రెడ్డి, గడికోట శ్రీకాంత్‌ రెడ్డి, ప్రభుత్వ విప్‌లు ఉన్నారు. వీరితోపాటు మరికొంతమందితో కూడిన టీంను సిద్ధం చేస్తున్నారు.

వీరంతా ప్రతి రోజూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వెంటనే పార్టీ కేంద్ర కార్యాలయంతో సంప్రదించి మీడియా సమావేశాలు నిర్వహించడం ద్వారా కౌంటర్‌ అటాక్‌ ఇవ్వాలని ఆదేశించారు. ఇదే స్థాయిలో జిల్లాల్లోనూ కొంత మందిని ఎంపికచేసి ఆయా జిల్లాల పరిధిలో గట్టి కౌంటర్‌ ఇవ్వాలని, స్థానికంగా జరిగే పార్టీ సమావేశాల్లోనూ ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తే తిప్పి కొట్టే అంశంలో వేరే ఆలోచన అవసరం లేదని, ఆమేరకు కౌంటర్‌ ఇవ్వాలని పార్టీ నేతలకు సీఎం జగన్‌ స్పష్టమైన ఆదేశాలు జారీచేస్తున్నారు.

- Advertisement -

ఏకమవుతున్న పార్టీలు

సీఎం జగన్‌ లక్ష్యంగా ప్రత్యర్ధి పార్టీలు ఏకమవుతున్నాయి. ఎవరి దారి వారిదే అన్నట్లుగా ప్రస్తుతం వ్యవహరిస్తున్నా.. లక్ష్యం మాత్రం ఒక్కటేనని స్పష్టం చేస్తున్నాయి. ఈ పార్టీలన్నీ సీఎం జగన్‌ టార్గెట్‌గా ఎన్నికలకు సిద్దం అవుతున్నాయి. నాలుగు వైపులా జగన్‌ను ఉక్కిరి బిక్కిరి చేయాలనేది వారి వ్యూహం. దీనిని ఎదుర్కోవటానికి వైసీపీ సిద్దం అయింది. బీజేపీ అధ్యక్షుడు నడ్డా మొదలు.. చంద్రబాబు… పవన్‌ కల్యాణ్‌ వరకు ఎవరు ఆరోపణలు చేసినా తిప్పి కొట్టి తాము ప్రజలకు ఏమి చేసామో వివరించేలా పార్టీ ఫైర్‌ బ్రాండ్స్‌ను రంగంలోకి దించుతోంది. అందులో సీనియర్లకు కీలక బాధ్యతలు అప్పగించాలని పార్టీ నిర్ణయించింది. జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అవసరమైన సందర్భాలలో ఢిల్లీలోనూ స్పందించేలా కార్యాచరణ సిద్దం చేస్తోంది.

మాటల తూటాలు.. సీఎం జగన్‌ టార్గెట్‌ రాజకీయం

టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం జగన్‌కు వ్యతిరేకంగా తన కూటమిని సిద్దం చేస్తున్నారు. దాదాపు ఇప్పటికే మద్దతిచ్చే పార్టీలతో ఒక ఒప్పందానికి వచ్చారు. అందరూ ఇప్పుడు వైసీపీ ప్రభుతాన్ని టార్గెట్‌ చేస్తున్నారు. ఈ సమయంలోనే వైసీపీ నుంచి కౌంటర్‌ ఎటాక్‌ సీరియస్‌గా మొదలైంది. బీజేపీతో సన్నిహిత సంబంధాలు.. రకరకాల ప్రచారాలు ప్రతిపక్షాలు చేస్తన్న సమయంలో.. జేపీ నడ్డా కామెంట్స్‌పై మాజీ మంత్రి పేర్ని నాని సీరియస్‌గా స్పందించారు. కర్ణాటక ఓటమిని ప్రశ్నించారు. స్టీల్‌ ప్లాంట్‌ భూముల వ్యవహారాన్ని నిలదీసారు. 2014లో టీడీపీ, బీజేపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై నాడు బీజేపీ చేసిన ఆరోపణలను ప్రస్తావించారు. దీనికి బీజేపీ నుంచి స్పందన లేదు. బీజేపీ.. వైసీపీ ఎప్పుడు కలిసి ఉందని మాత్రమే ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. టీడీపీతో తమకు బంధం ఉండదనీ చెప్పటం లేదు.

మంత్రుల మూకుమ్మడి దాడ

బీజేపీ నేతలు నడ్డా, అమిత్‌ షా వ్యాఖ్యలపై పార్టీ సీనియర్లంతా వరుసపెట్టి ఎదురు దాడి చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి, తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు బొత్స, కారుమూరి, అమర్నాథ్‌ ఇలా ప్రతి ఒక్కరూ కౌంటర్‌ అటాక్‌ చేశారు. దీంతో బీజేపీ నుండి తిరిగి స్పందన కనిపించలేదు. విభజన హామీలు, తిరుపతిలో ఇచ్చిన హామీ, విశాఖ వేదికగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపడం వంటివేమీ లేవన్న దానిపై బీజేపీ నుండి సమాధానం లభించలేదు. ఇది మంచి ఫలితాలను ఇచ్చిందని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఇంతకంటే మెరుగైన ఫలితాలు రావాలంటే ఇందుకోసం ప్రత్యేకంగా ఒక టీం తయారుచేసి నిత్యం ఇదే పనిలో ఉండేలా చూడాలని నిర్ణయించారు. వారికి అవసరమైన ఫీడ్‌ బ్యాక్‌ను కేంద్ర కార్యాలయం నుండి ఎప్పటికప్పుడు అందించేలా కార్యాచరణ ప్రారంభమైంది.

పవన్‌ వ్యాఖ్యలను తిప్పి కొట్టాల్సిందే

ఇక, పేర్ని నాని ఇప్పుడు పవన్‌ కల్యాణ్‌ విషయంలోనూ సీరియస్‌గా రియాక్ట్‌ అయ్యారు. వారాహి యాత్ర తొలి రోజున పవన్‌ చేసిన విమర్శలకు గట్టి కౌంటర్‌ ఇచ్చారు. ఒక చెప్పు చూపిస్తే రెండు చెప్పులు చూపిస్తామంటూ హెచ్చరించారు. పవన్‌ వైసీపీని హెచ్చరిస్తూ చేస్తున్న వ్యాఖ్యలను కౌంటర్‌గా పవన్‌ డ్రామాలు చేస్తే మక్కెలిరగదీస్తామని పేర్ని నాని వార్నింగ్‌ ఇచ్చారు. దీనిపై కూడా జనసేనాని స్పందన పెద్దగా కనిపించలేదు. ఈ తరహా ప్రయత్నాలు మంచి ఫలితాలనిస్తాయని పార్టీ గట్టిగా నమ్ముతోంది. ఆదిశగా వడివడిగా ఏర్పాట్లు చేయాలని భావిస్తోంది. ఇప్పటికే సీఎం జగన్‌ దీనికి సంబంధించి మంచి వాక్‌ పఠిమ కలిగిన నేతల జాబితాను తనకు అందజేయాలని పార్టీ బాధ్యులకు ఆదేశాలిచ్చారు. వారు కొంత మంది నేతలను ఎంపికచేసి సీఎం జగన్‌కు సమర్పించారు. ఆమేరకు వారికి వెంటనే బాధ్యతలు అప్పగించాలని సీఎం ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement