Friday, November 22, 2024

అనారోగ్యంతో చిన్నారి.. అభ‌య‌హ‌స్తం అందించిన సీఎం జ‌గ‌న్

అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఓ చిన్నారికి అభ‌య హ‌స్తం అందించారు ఏపీ సీఎం జ‌గ‌న్. ఆర్థిక కష్టాలతో చిన్నారికి వైద్యం చేయించలేకపోతున్న తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. బుధవారం శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట పర్యటనలో భాగంగా ఈ సంఘటన జరిగింది. సీఎం జగన్ హెలికాప్టర్ దిగి సభా ప్రాంగణం వద్దకు వెళ్తుండగా ఓ చిన్నారిని పట్టుకొని తల్లిదండ్రులు ఆయనకు తారసపడ్డారు. దాంతో, సీఎం జగన్ వారి వద్దకు వెళ్లారు. శ్రీకాకుళం జిల్లా రేగడి మండలం చిన్న సిర్లాం గ్రామానికి అప్పలనాయుడు, కృష్ణవేణి దంపతుల కూతురు ఇంద్రజ పుట్టినప్పటి నుంచి తలకు సంబంధించిన వ్యాధితో బాధపడుతోంది.

సీఎం నర్సన్నపేటకు వస్తున్నారని తెలిసి ఓ సామాజిక కార్యకర్త సాయంతో ఈ చిన్నారిని తీసుకొని వంద కిలోమీటర్లు ప్రయాణం చేసి అక్కడకు చేరుకున్నారు. తమను చూసి సీఎం దగ్గరకు రావడంతో పాప పరిస్థితిని ఆయనకు వివరించారు. స్పందించిన ముఖ్యమంత్రి జగన్.. అక్కడే ఉన్న శ్రీకాకుళం కలెక్టర్ను పిలిచి చిన్నారి వైద్యానికి సాయం అందించాలని ఆదేశించారు. ప్రస్తుతం ఆ కుటుంబానికి రూ. 3 వేల పెన్షన్ వస్తుండగా.. ఇకపై రూ. 10 వేల పెన్షన్ అందించాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement