అమరావతి, ఆంధ్రప్రభ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహనరెడ్డి ఈనెల 5న ఢిల్లి బయల్దేరి వెళ్లనున్నారు. ఈనెల 6న ఢిల్లిలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా భేటీ కానున్నారు. మావోయిస్టు ప్రాబల్యం కలిగిన పది రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఆహ్వానాలు పంపారు. ఆయా రాష్ట్రాల్లో ఉమ్మడి వ్యూహంతో మావోయిస్టుల అణచివేతకు కార్యాచరణ నిర్దేశించనున్నట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, చత్తీస్‌గడ్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భవిష్యత్ వ్యూహాన్ని సిద్ధం చేయనున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో నల్లమల అటవీ ప్రాంతంలో గత రెండు దశాబ్దాలుగా మావోయిస్టు కార్యకలాపాలు పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టగా , ఆంధ్ర- ఒడిశా సరిహద్దు ప్రాంతం (ఏఓబీ)లోనే మావోయిస్టుల కదలికలు ఉన్నాయి. ఇప్పటికే ఆంధ్ర- ఒడిశా పోలీసులు సంయుక్తంగా కూంబింగ్‌లు నిర్వహిస్తున్నారు.
ఇదిలా ఉండగా కేంద్రం స్థాయిలో ఆపరేషన్ గ్రీన్‌హంట్, సమాధాన్ అమలు జరుపుతోంది.. ఈ ఏడాది చివర, వచ్చే ఏడాది లోక్‌సభతో పాటు, వివిధ రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నందున ఎన్నికల బహిష్కరణ పిలుపుతో అనర్థాలు తలెత్తకుండా ఉండేందుకు ఉమ్మడి కార్యాచరణతో పూర్తి స్థాయిలో మావోయిస్టుల అణచివేతకు కేంద్రం రంగ సిద్ధం చేసుకుంటోంది. ఇందులో భాగంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో అమిత్‌షా భేటీ కానున్నారు. దీనికి తోడు రాష్ట్రంలో ఇటీవలే మావోయిస్టు, అనుబంధ సంఘాలపై నిషేధాన్ని ఏడాదిపాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మావోయిస్టు కార్యకలాపాలు అంతగా లేకపోయినా అప్రమత్తంగా ఉండటం ద్వారా నియంత్రణ చర్యలు చేపట్టనున్నట్లు తెలియవచ్చింది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు సీఎం జగన్ ఢిల్లి పయనమవుతున్నారు. ఇదిలా ఉండగా ఈనెల 10వ తేదీన తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లి ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనున్నందున ప్రధానమంత్రి నరేంద్రమోడీ, హోం మంత్రి అమిత్‌షాలతో కీలకమైన చర్చలకు అవకాశం ఉంటుందనే ప్రచారం జరుగుతోంది.. తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటన అనంతరం సీఎం జగన్ ఢిల్లి పర్యటన కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.
కాగా రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడు స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, వివిధ అవినీతి ఆరోపణలతో అరెస్టు కావటం, రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న తీరును ముఖ్యమంత్రి కేంద్ర పెద్దలకు వివరించనున్నట్లు తెలిసింది. చంద్రబాబు అరెస్టు అనంతరం జనసేన పార్టీ అధినేత పొత్తుల ప్రకటనను ప్రధాని దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు చెబుతున్నారు.
అంతేకాదు అరెస్టు వెనుక కేంద్రం భాగస్వామ్యం ఉందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారాలను కూడా ప్రధాని మోడీ, అమిత్‌షా ముందుంచే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర విభజన సందర్భంగా రావాల్సిన ప్రయోజనాలు.. కేంద్ర హామీలను మరోసారి గుర్తుచేయనున్నారు. పోలవరం ప్రాజెక్టు, కడప ఉక్కు కర్మాగారంతో పాటు రాష్ట్రానికి బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ అమలుపై ప్రధాని, హోం మంత్రితో చర్చించనున్నారు.
మూడు రాజధానుల వ్యవహారం సుప్రీం కోర్టు పరిధిలో ఉన్నందున దసరా సందర్భంగా తన క్యాంప్ కార్యాలయాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేసే అంశాన్ని కూడా ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాల సమాచారం. ముందుగా నిర్దేశించుకున్న షెడ్యూల్ ప్రకారం ముఖ్యమంత్రి జగన్ యూకే పర్యటన ముగించుకువచ్చిన అనంతరం గత నెల 4, 5 తీదీల్లోనే ప్రధాని, అమిత్‌షాలను కలవాలని నిర్ణయించారు. అయితే అనివార్య కారణాల వల్ల ఆ పర్యటన వాయిదా పడింది.