ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. మిలాన్–2022 యుద్ధనౌకల సమాహారంలో భాగంగా నిర్వహించే ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ కార్యక్రమంలో సీఎం జగన్ ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు. ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు సీఎం విశాఖకు చేరుకుంటారు. ఆ తర్వాత నావల్ డాక్‌యార్డ్‌కు వెళ్లి అక్కడ జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం ఐఎన్‌ఎస్ వేలా సబ్‌మెరైన్ సందర్శిస్తారు. అక్కడి నుంచి ప్రభుత్వ సర్క్యూట్ హౌస్‌కు వెళ్తారు. సాయంత్రం 5.30 గంటలకు ఆర్‌కే బీచ్‌కు చేరుకుని ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ మిలాన్–2022లో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం రాత్రి 7.15 గంటలకు విశాఖ ఎయిర్ పోర్ట్ నుంచి గన్నవరం బయల్దేరుతారు. అక్కడి నుంచి తాడేపల్లిలోని ఇంటికి చేరుకుంటారు.
కాగా, సీఎం వైఎస్ జగన్ ఈ నెలలో విశాఖపట్నంలో పర్యటించడం ఇది మూడోసారి. ఈ నెల ప్రారంభంలో జరిగిన విశాఖ శారదాపీఠం వార్షికోత్సవ వేడుకలకు హాజరైన జగన్.. ఆ తర్వాత ఫ్లీట్ రివ్యూకు హాజరైన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు స్వాగతం పలికేందుకు వెళ్లారు. ఇప్పుడు మూడోసారి వైజాగ్‌లో పర్యటించనున్నారు. ఆదివారం విశాఖపట్నంలో జరిగే మిలన్-2022 కార్యక్రమానికి సీఎం జగన్ హాజరుకానున్నారు.