ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త పథకానికి సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టనున్నారు. రేపు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ‘జగనన్న సంపూర్ణ గృహ హక్కు’ పథకాన్ని ప్రారంభించబోతున్నారు. మంగళవారం(డిసెంబర్ 21) ఉదయం 10.30 గంటలకు సీఎం జగన్ తాడేపల్లి నివాసం నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి 11 గంటలకు తణుకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా తణుకు జెడ్పీ బాలుర హైస్కూల్‌లో జరిగే బహిరంగ సభకు వెళ్తారు. అనంతరం అక్కడ జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకాన్ని ప్రారంభిస్తారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం తణుకు నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకు తిరుగు ప్రయాణం అయ్యి.. తాడేపల్లి చేరుకుంటారు.
కాగా, రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలకు సంపూర్ణ హక్కులు కల్పించాలని, వారి ఇళ్లపై వారికి అధికారాలను ఇవ్వాలని వైసీపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా జగనన్న ‘సంపూర్ణ గృహ హక్కు పథకం (వన్ టైం సెటిల్ మెంట్)’ తీసుకొచ్చింది. అయితే.. ఈ పథకంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. వన్ టైమ్ సెటిల్మెంట్ స్కీమ్ (ఓటీఎస్) కింద లబ్ధిదారుల నుంచి ఇప్పటికే రిజిస్ట్రేషన్‌కు ప్రభుత్వం నగదు వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. పేదలు ఎవరూ ఓటీఎస్ కింద డబ్బులు చెల్లించొద్దని.. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ ఉచితంగానే ఇంటి పట్టాలు అందజేస్తామంటూ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తున్నారు.