Thursday, November 21, 2024

ప్రీ- ప్రైమరీ విద్యార్థులకు ఉత్తమ విద్యాబోధన

నిరుపేద విద్యార్థులకు కూడా అత్యుత్తమ ప్రమాణాలతో విద్య అందించాలని నా తపన, ఆరాటం అని సీఎం జగన్ అన్నారు. ఆ ఆలోచనల నుంచి పుట్టుకొచ్చినవే ఈ వైఎస్సార్‌ ప్రి ప్రైమరీ స్కూళ్లు.. ఫౌండేషన్‌ స్కూళ్లు అని తెలిపారు. ప్రీ ప్రైమరీ, ప్రైమరీ విద్యార్ధులకు గట్టి పునాదులపై విద్యాశాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వసతులతో విద్యార్థులకు మంచి చదువు అందించడమే లక్ష్యంగా మనబడి, నాడు–నేడు చేపట్టామని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా, స్కూళ్ల రూపురేఖలనే సమూలంగా మార్చేస్తున్నామని చెప్పారు. ప్రతి మండలానికీ ఒక జూనియర్‌ కాలేజీ పెట్టాలనుకున్నామన్నారు. ఇది కాకుండా ప్రస్తుతం ఉన్న హైస్కూళ్లలో 11, 12 తరగతులను పెట్టడమా? లేక మండలానికి ఒక జూనియర్‌ కాలేజీని పెట్టాలా? అలాగే కొన్ని మండలాల్లో అవసరాల మేరకు 2 జూనియర్‌ కాలేజీలు పెట్టాలా? అన్నదానిపై పూర్తి స్థాయి పరిశీలన చేయాలని అధికారులను సీఎం సూచించారు.

 ఫౌండేషన్‌ స్కూళ్లు అన్నీ కూడా ఒక కిలోమీటర్‌ దూరం లోపల ఉండాలని సీఎం జగన్ స్పష్టం చేవారు. అలాగే అన్ని హైస్కూళ్లు (3 తరగతి నుంచి 10 లేదా 12వ తరగతి) 3 కిలోమీటర్ల దూరం లోపల ఉండాలన్నారు.  వైఎస్సార్‌ ప్రిప్రైమరీ స్కూళ్లు పిల్లలకు చాలా దగ్గరగా అందుబాటులో ఉండాలని సూచించారు. ఆ విధంగా ఆ స్కూళ్ల మ్యాపింగ్‌ చేయాలన్నారు. టీచర్లలోని బోధనా సామర్థ్యాని మరింత వినియోగించుకునేలా తగిన హేతుబద్ధీకరణ చేపట్టాలన్నారు. తద్వారా పిల్లలకు ఇంకా అత్యుత్తమ విద్యను అందించవచ్చు అని అభిప్రాయపడ్డారు. స్థానిక ప్రాథమిక పాఠశాలలో అంగన్‌ వాడీలు (పీపీ–1, పీపీ–2), 1, 2 తరగతుల ఫౌండేషన్‌ స్కూళ్ల ఏర్పాటు తర్వాత డిజిటల్‌ బోధన ప్రక్రియ (డిజిటల్‌ టీచింగ్‌)పై దృష్టి పెట్టాలన్నారు. ఆ మేరకు డిజిటిల్‌ బోధనా పద్ధతులు (టీచింగ్‌ మెథడాలజీ) రూపొందించాలని ఆదేశించారు. బ్లాక్‌ బోర్డు నుంచి గ్రీన్‌ బోర్డ్స్‌కు మారాం అని, ఇక ముందు డిజిటిల్‌ బోర్డ్స్‌కు వెళ్లే పరిస్థితి వస్తుందని సీఎం చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement