Tuesday, November 26, 2024

సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం.. సీఎం జగన్ కీలక సూచన

సదరన్‌ కౌన్సిల్‌ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చేలా చూడాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు. నవంబర్‌ 14న తిరుపతిలో జరగనున్న 29వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం ఏర్పాట్లపై బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ విభజన చట్టానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలను అజెండాలో పొందుపరిచామని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. తమిళనాడు నుంచి తెలుగు గంగ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు, పోలవరం ప్రాజెక్టు, రూ.6,300 కోట్ల విద్యుత్‌ బకాయిలు, రెవిన్యూలోటు, రేషన్‌ బియ్యంలో హేతుబద్ధతలేని రీతిలో కేంద్రం కేటాయింపులు, తెలంగాణ నుంచి రావాల్సిన సివిల్‌ సప్లైస్‌ బకాయిల అంశాలపై చర్చించాలని సీఎం జగన్‌ నిర్ణయించారు. ఎఫ్‌డీ ఖాతాల స్తంభన, ఆస్తుల విభజనలో అపరిష్కృత అంశాలనూ ప్రస్తావించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేక హోదా అంశాన్ని కూడా సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ప్రస్తావించాలని ఈ సన్నాహక సమావేశంలో నిర్ణయించారు.

కేఆర్‌ఎంబీ పరిధిలోకి జూరాల ప్రాజెక్టును తీసుకురావాలన్న అంశాన్ని సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ప్రస్తావించాలన్నారు. నదుల అనుసంధానంపై కేంద్రం ప్రతిపాదనల మీద సమావేశంలో చర్చ జరిగింది. దీనిపై రాష్ట్రానికి మేలు జరిగేలా, వీలైనంత త్వరగా సాకారం అయ్యే ప్రణాళికలు, రాష్ట్రం సూచిస్తున్న ప్రత్యామ్నాయాలపై వివరాలు తయారుచేయాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. వీటికి సంబంధించి పూర్తి వివరాలతో అధికారులు సిద్ధం కావాలని ఆదేశించారు. కౌన్సిల్‌ సమావేశంలో ఇతర రాష్ట్రాలు ప్రస్తావించే అంశాల్లో రాష్ట్రానికి సంబంధించిన విషయాలు ఉంటే.. వాటిపై కూడా తగిన రీతిలో సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. 

కాగా, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అధ్యక్షత వహించనున్న 29వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశాలకు ఆంధ్రప్రదేశ్‌ ఆతిథ్యమిస్తోంది. ఏపీ, తెలంగాణా, తమిళనాడు, కర్ణాటక, కేరళ ముఖ్యమంత్రులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా పాండిచ్చేరి, అండమాన్‌నికోబార్‌, లక్షద్వీప్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్లు హాజరవుతారు. ఈ సమావేశంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయం.. కేంద్ర, రాష్ట్రాల మధ్య పరిష్కారం కానీ పలు కీలకమైన అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి:అసెంబ్లీలో ఆర్ఆర్ఆర్ వాయిస్.. నిజమైన బండి సంజయ్ జోస్యం!

Advertisement

తాజా వార్తలు

Advertisement