‘యాస్’ తుపానుతో కరోనా రోగులకు ఇబ్బంది కలగకుండా చూడాలి సీఎం జగన్ ఆధికారులను ఆదేశించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ‘యాస్’ తుపానుపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఏపీ సీఎం జగన్ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉత్తరాంధ్రపై ‘యాస్’ తుపాను ప్రభావం చూపుతుందన్న వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో తుపాను సహాయక చర్యలు, కొవిడ్ కార్యాచరణ నడుమ సమన్వయం అవసరమని సీఎం జగన్ అధికారులకు సూచించారు.
ఆక్సిజన్ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడాలని సీఎం అన్నారు. తుపాను పరిణామాలను ఊహించి ఆ మేరకు సిద్ధం కావాలన్నారు. ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తున్న ప్లాంట్లకు విద్యుత్ సరఫరాలో ఎలాంటి అవాంతరాలు లేకుండా చూడాలని సూచించారు. ఆక్సిజన్ సిలెండర్లకు, రీఫిల్లింగ్ చేసే ప్లాంట్లకూ విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని సంబంధిన అధికారులకు ఆదేశించారు. ఆస్పత్రులకు కరెంటు సరఫరాలో ఇబ్బందులు లేకుండా డీజిల్ జనరేటర్లు ఏర్పాటు చేయాలని, ప్రత్యేకంగా విద్యుత్ సిబ్బందిని ఆయా ఆస్పత్రులకు కేటాయించాలని సీఎం స్పష్టం చేశారు. తుపాను కారణంగా ఒడిశా ప్లాంట్ల నుంచి ఆక్సిజన్ సేకరణకు ఇబ్బందులు వస్తే ప్రత్యామ్నాయాలు సిద్ధం చేసుకోవాలని నిర్దేశించారు. ఆక్సీజన్ తగినంత నిల్వలు పెట్టుకోవాలని అధికారులకు సీఎం ఆదేశించారు.
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో కరోనా రోగులను తరలించాల్సిన పరిస్థితులు వస్తే తక్షణమే ఆ పనిచేయాలన్నారు.శ్రీకాకుళం జిల్లాలో లోతట్టు ప్రాంతాల ప్రజలను సహాయక శిబిరాలకు తరలించాలని తెలిపారు. సహాయక శిబిరాల్లో సౌకర్యాల లోటు ఉండకూడదని స్పష్టం చేశారు. ముఖ్యంగా కొవిడ్ రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో కోవిడ్ పేషెంట్ల తరలింపు అవసరం అనుకుంటే, ఇప్పుడే ఆ పని చేయాలన్నారు.
కోవిడ్ కరెంటు సప్లైకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఒకటికి రెండు సార్లు పూర్తిస్తాయిలో ఆలోచనలు చేసి సమర్థవంతగా చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన సాంకేతిక సిబ్బందిని సిద్ధంగా ఉంచుకోవాలని సీఎం ఆదేశించారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థను పునఃసమీక్షించుకుని అందుకు తగిన విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన చోట్ల లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లాలో లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజల తరలింపు వెంటనే ప్రారంభం కావాలని సీఎం స్పష్టం చేశారు. సహాయ శిబిరాల్లో నిత్యావసరాలు మొదలు, అన్ని సదుపాయాలు ఉండేలా చూసుకోవాలన్నారు. కోవిడ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తగిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు.
ఇదీ చదవండి : యూపీకి మిడతల దండు ముప్పు.. 17 జిల్లాల్లో హై అలర్ట్