Tuesday, November 26, 2024

హెల్త్‌ హబ్స్‌ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ: సీఎం జగన్ కీలక ఆదేశం

హెల్త్‌ హబ్స్‌ ద్వారా ఏర్పాటయ్యే ఆస్పత్రుల్లో కనీసం యాభై శాతం బెడ్లను ఆరోగ్యశ్రీ పేషెంట్లకు ఇవ్వాలని సీఎం వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. ఆరోగ్య బీమా కంపెనీలు చెల్లిస్తున్న ఛార్జీలతో పోలిస్తే ఆరోగ్యశ్రీ కింద చెల్లిస్తున్న ఛార్జీలు మెరుగ్గానే ఉన్నాయన్నారు. ఎవరెక్కువ బెడ్లను ఆరోగ్యశ్రీకి కేటాయిస్తే వారికి హెల్త్‌ హబ్స్‌లో ప్రాధాన్యత ఇచ్చేలా చూడాలని సీఎం పేర్కొన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో వైద్య, ఆరోగ్య శాఖపై సీఎం సమీక్ష జరిపారు. అదే విధంగా రాష్ట్రంలో కోవిడ్‌ పరిస్థితులు, వ్యాక్సినేషన్, హెల్త్‌ హబ్స్, ఆస్పత్రుల నిర్వహణ, ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌లపై కూడా సీఎం అధికారులతో చర్చించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. హెల్త్‌హబ్స్‌ ద్వారా వచ్చే ఆస్పత్రుల బోర్డుల్లో ఒక సభ్యుడు ప్రభుత్వం నుంచి ఉంటారని తెలిపారు. రాష్ట్రానికి చెందిన డాక్టర్లు ఇక్కడే స్థిరపడి మంచి వైద్య సేవలు అందించే ఉద్దేశం కూడా హెల్త్‌ హబ్స్‌ ద్వారా నెరవేరుతుందన్నారు. డాక్టర్లు నిరంతరం అందుబాటులో ఉండాలన్నది ఆస్పత్రుల ఎంపికకు ఒక ప్రమాణం కావాలని తెలిపారు. అవయవ మార్పిడి చికిత్సలు చేసే ఆస్పత్రుల ఏర్పాటుపై హెల్త్‌ హబ్స్‌లో ప్రత్యేక దృష్టిపెట్టాలని పేర్కొన్నారు. వైద్యం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లే అవసరం ఇక ఉండకూడదని సీఎం స్పష్టం చేశారు. లాభాపేక్షలేకుండా ఆస్పత్రులు నిర్వహిస్తున్న సంస్థలకూ ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం చెప్పారు.

వివిధ వైద్య సంస్థలు, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో అనుసరిస్తున్న నిర్వహణా విధానాలను సీఎంకు అధికారులు వివరించారు. ఆస్పత్రుల నిర్వహణకోసం ప్రత్యేక అధికారుల నియమిస్తున్నట్లు తెలిపారు. బిల్డింగ్‌ సర్వీసులు, ఫెసిలిటీ మేనేజ్‌మెంట్‌ సర్వీసులు, బయోమెడికల్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ సేవలను అధికారులు నిర్వహించనున్నారు. సీహెచ్‌సీల నుంచి బోధనాసుపత్రుల వరకూ నిర్వహణ కోసం అధికారుల నియామకానికి సీఎం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఉత్తమ నిర్వహణా పద్ధతులకు అనుగుణంగా కొత్తగా నిర్మిస్తున్న ఆస్పత్రులు, బోధనాసుపత్రుల నిర్మాణాలు ఉండాలని  సీఎం ఆదేశించారు. అలాగే వీటి డిజైన్లపై ప్రత్యేక దృష్టిపెట్టాలని, ఆస్పత్రుల్లో బెడ్ల నిర్వహణ, బాత్రూమ్‌ల నిర్వహణ, పరిశుభ్రత, ఆహారంలో నాణ్యత చాలా ముఖ్యమని తెలిపారు. 

రిసెప్షన్‌ సేవలు కూడా కీలకమని అన్నారు. సరిపడా వైద్యులు, పైన పేర్కొన్న సేవలు నాణ్యతతో అందితే కార్పొరేట్‌ ఆస్పత్రుల స్థాయిలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా సేవలు అందినట్లేనని పేర్కొన్నారు. అత్యుత్తమ నిర్వహణా పద్ధతులను ప్రభుత్వ ఆస్పత్రుల్లో అమలు చేయాలని, ఎవరి ఆరోగ్యం బాగోలేకపోయినా అందరూ కూడా ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లే పరిస్థితి ఉండాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆకాక్షించారు. ఆస్పత్రుల నిర్వహణలో పర్యవేక్షణ స్థాయి బలోపేతంగా ఉండాలని, నిర్ణీత రోజులకు మించి సెలవులో ఉంటే.. వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.

- Advertisement -

ఇది కూడా చదవండిః భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనంపై గందరగోళం.. అయోమయంలో పోలీసులు..

Advertisement

తాజా వార్తలు

Advertisement