Tuesday, November 26, 2024

బ్లాక్ ఫంగస్ పై అప్రమత్తం.. అధికారులకు సీఎం దిశానిర్దేశం

బ్లాక్‌ ఫంగస్‌ విషయంలో పూర్తి అప్రమత్తంగా ఉండాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ఆక్సిజన్‌  సరఫరా పైపులు, మాస్క్‌లు అన్నింటిలోనూ ప్రమాణాలు పాటించాలని సీఎం జగన్‌ సూచించారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై శుక్రవారం క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.  ఆక్సిజన్‌ తీసుకునేటప్పుడు వినియోగించే నీటి విషయంలో జాగ్తత్తలు తీసుకోవాలన్న కొత్త సమాచారం వస్తోందన్నారు. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని పటిష్టమైన ప్రొటోకాల్స్‌ రూపొందించాలని తెలిపారు. ఆక్సిజన్‌ సరఫరా పైపులు, మాస్క్‌లు.. అన్నీ నిర్ణీత ప్రమాణాలున్న వాటినే వినియోగించాలని చెప్పారు. 50 బెడ్స్, అంతకన్నా ఎక్కువ ఉన్న ఆస్పత్రుల్లో ఖచ్చితంగా ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్లు ఉండాలన్నారు. 100 టన్నుల సామర్థ్యంతో ఆక్సీజన్‌ ప్లాంట్‌ పెడితే 20 శాతం ఇన్సెంటివ్‌ ఉంటుందన్నారు.

కనీసం 4 నెలల వ్యవధిలో అన్ని ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ ప్లాంట్లు ఏర్పాటయ్యేలా చూడాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ బెడ్‌ కెపాసిటీకి అనుగుణంగా ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని సీఎం జగన్ సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పిల్లల చికిత్స కోసం ఐసీయూ బెడ్స్‌ ఏర్పాటు చేయాలని, ఆ ఆస్పత్రుల్లో కూడా బెడ్‌ కెపాసిటీకి అనుగుణంగా ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. 300 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ ఉత్పత్తి సామర్థ్యంపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. గ్లోబల్‌ టెండర్ల ద్వారా వీలైనన్ని వ్యాక్సిన్లు సేకరించాలని, రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన వారందరికి భవిష్యత్తులో వ్యాక్సిన్లు ఇవ్వాలన్నారు.  2 కోట్ల మందికి సరిపడా 4 కోట్ల డోస్‌ లు ఇప్పుడు సేకరిస్తుండగా, వీలుంటే ఇంకా ఎక్కువ వచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. తొలుత 45 ఏళ్లకు పైబడిన వారందరికీ రెండు డోస్‌లు ఇవ్వాలని, ఆ తర్వాత 18–45 ఏళ్ల మధ్య వారికి కూడా తప్పనిసరిగా రెండు డోస్‌ ల వ్యాక్సిన్లు ఇవ్వాలని సీఎం సూచించారు. కాబట్టి వీలైనన్ని ఎక్కువ వ్యాక్సిన్లు సేకరించాలని ఆదేశించారు.

కోవిడ్‌ ఆస్పత్రుల్లో రోగులకు మంచి ఆహారం అందించాలని, అదే విధంగా ఆ ఆస్పత్రుల్లో పారిశుద్ధ్యం బాగుండాలని సీఎం అన్నారు. ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నాం కాబట్టి, చిన్న చిన్న విషయాల్లో ఎలాంటి కొరత లాకుండా ఉండాలన్నారు. ఆస్పత్రుల్లో పారిశుద్ధ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ప్రతి ఆస్పత్రి నుంచి నివేదికలు తెప్పించుకుని చర్యలు తీసుకోవాలన్నారు. రోగులకు అసౌకర్యంగా, అపరిశుభ్ర వాతావరణం ఉండకూడదని స్పష్టం చేశారు.

ప్రభుత్వం నిర్ణయించిన ధరలకన్నా అధికంగా ఫీజులు వసూలు చేస్తున్న ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశించారు. అలాగే రెమ్‌డెసివర్‌ వంటి ఇంజక్షన్ల విషయంలో అక్రమాలకు పాల్పడ్డ ఆస్పత్రులపైనా కచ్చితంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇంటెలిజెన్స్‌ అధికారులు బుక్‌ చేసిన కేసులపై చర్యలుండాలని స్పష్టం చేశారు.

- Advertisement -

ఇదీ చదవండి: కృష్ణపట్నంలో కరోనాకు ఆయుర్వేద మందు పంపిణీ

Advertisement

తాజా వార్తలు

Advertisement