కొవిడ్ బాధితులు 104కి ఫోన్ చేసిన 3 గంటల్లోనే పడక కేటాయించాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. కరోనా బాధితులకు ఉచితంగా మందులు ఇవ్వాలన్నారు. జిల్లా కలెక్టర్లతో మంగళవారం ఆయన స్పందన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కోవిడ్ నివారణ చర్యలు, వ్యాక్సినేషన్ పై సీఎం దిశానిర్దేశం చేశారు. 104కు ఫోన్ చేసిన వారికి తక్షణమే పరిష్కారం చూపాలన్నారు. 104 కాల్ సెంటర్ కు వైద్యులు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. కొవిడ్ ఆసుపత్రులను జేసీలు పర్యవేక్షించాలని ఆదేశించారు. జిల్లాస్థాయిలో కొవిడ్ ఆస్పత్రులను క్లస్టర్లుగా విభజించి, అన్నిచోట్లా పూర్తిస్థాయిలో సిబ్బంది ఉండాలే జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది, పారామెడికల్ సిబ్బంది పూర్తిస్థాయిలో ఉండాలన్నారు. ఆస్పత్రుల్లో ఖాళీల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించాలని సూచించారు. ప్రజలు గుమికూడకుండా చూడాలని, పెళ్లిళ్లలకు 50 మందికి మాత్రమే అనుమతి ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు.
మరోవైపు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 40 పడకల ఆస్పత్రులను కరోనా ఆస్పత్రులుగా మార్చేందుకు ఏర్పాట్లు చేస్తుండగా.. ప్రతి నియోజకవర్గంలో కోవిడ్ కేర్ సెంటర్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. నియోజకవర్గ కేంద్రాల్లో కాలేజీలను కోవిడ్ కేర్ సెంటర్లుగా ఏర్పాటు చేయనుండగా.. రోజుకు 12 వేల రెమిడిసివిర్ ఇంజెక్షన్లను తెప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.