ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెరుగుతున్నవేళ.. కేంద్ర ప్రభుత్వంలో మాట్లాడి అవసరమైనన్ని డోసులు వచ్చేలా చూడాలని అధికారులకు సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. కోవిడ్ నివారణకు వాక్సినేషన్ ఒక్కటే మార్గమని.. దీనిపై అధికారులు మరింత చురుగ్గా దృష్టి సారించాలన్నారు. ప్రస్తుతం అర్బన్ వార్డు సచివాలయాల్లో జరుగుతున్న వాక్సినేషన్‌ను రూరల్ లో కూడా జరిగేలా చూడాలన్నారు.
ఏపీలో కరోనా వ్యాక్సినేషన్, ఆస్పత్రుల్లో సౌకర్యాలపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రతిరోజు సగటున 1.4 లక్షల మందికి కరోనా వాక్సినేషన్ వేస్తున్నామని అధికారులు సీఎంకు తెలిపారు. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం వాక్సినేషన్‌కు మన యంత్రాంగం సర్వం సమాయాత్తమై ఉందని, అయినా తగినన్ని డోసుల వాక్సిన్ అందుబాటులో లేదని సీఎంకు వివరించారు. ప్రస్తుతానికి 3 లక్షల డోసులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని ఇవి రెండు రోజులకు మాత్రమే సరిపోతాయని సీఎంకు తెలిపారు. మన అవసరాలకు తగినన్ని డోసుల వాక్సిన్ సరఫరా కావడం లేదని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా.. కొవిడ్ పట్ల పూర్తి అప్రమత్తంగా వ్యవహరించాలని సీఎం జగన్ ఆదేశించారు. మళ్ళీ లాక్డౌన్ పరిస్థితులు వస్తే ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుందని.. గత ఏడాది కొవిడ్ వల్ల రాష్ట్రానికి రూ. 21 వేల కోట్లు ఆర్థికంగా నష్టం వచ్చిందని తెలిపారు. మరోసారి అలాంటి పరిస్థితి రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో కొరత రాకుండా అవసరమైన డోసులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
రాష్ట్రంలో 45 ఏళ్ళకు పైబడి ఇంకా వాక్సినేషన్ చేయించుకోవాల్సిన వారు సుమారు కోటి మంది వరకు వుంటారని అధికారులు వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు 4 లక్షలు, అర్బన్ ప్రాంతాల్లో రోజుకు 2 లక్షల మందికి వాక్సినేషన్ అందించాలన్న లక్ష్యంతో పనిచేయాలని సీఎం అదేశించారు. పిహెచ్‌సిల్లో ఇద్దరు, 104లో ఒక వైద్యుడు అందుబాటులో వున్న నేపథ్యంలో ప్రతి వైద్యుడు తన పిహెచ్సి పరిధిలో నిర్ధేశిత గ్రామాల్లో పర్యటించి వైద్యసేవలు అందించాలన్న సీఎం.. దీనికి సంబంధించి ఒక యాక్షన్ ప్లాన్ సిద్దం చేయాలని సూచించారు. వాక్సినేషన్ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు వలంటీర్లు, ఆశావర్కర్ల సేవలను వినియోగించుకోవాలని సీఎం జగన్ చెప్పారు. అప్పుడే అనుకున్న విధంగా వాక్సినేషన్ ప్రక్రియ సకాలంలో పూర్తవుతుందన్న అభిప్రాయపడ్డారు. వాక్సినేషన్ కోసం అవసరమైన డోస్‌లను సిద్దం చేసుకోవడం ద్వారా వాక్సినేషన్ డ్రైవ్‌ను విజయవంతం చేయాలన్నారు.
కోవిడ్ చికిత్స పేరుతో ప్రైవేటు ఆసుపత్రుల్లో దోపిడీ జరగడానికి వీల్లేదని.., ప్రభుత్వం నిర్ధేశించిన ధరలకే చికిత్స జరగాలని జగన్ స్పష్టం చేశారు. అలా కాకుండా అధిక ధరలపై ఫిర్యాదులు వస్తే సంబంధిత ఆసుపత్రిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని జగన్ ఆదేశించారు. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్పై దృష్టి పెట్టాలని చెప్పారు. మాస్క్ పెట్టుకోని వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలి సూచించారు.
కోవిడ్ వచ్చిన వారు ఆసుపత్రుల్లో బెడ్ కోసం 104 కి ఫోన్ చేసి అడిగితే గతంలో ఎలా సమకూర్చామో, ఇప్పుడు కూడా అలాగే చేయాలని జగన్ ఆదేశించారు. కోవిడ్ పేషంట్లకు ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా ఉచితంగా చికిత్స అందించాలన్నారు. ఆసుపత్రుల్లో స్టార్ రేటింగ్ ఇచ్చి మానిటరింగ్ చేయాలని.. ఆసుపత్రుల్లో ఫుడ్, ఇతర సదుపాయాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. శానిటేషన్, వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, ఆక్సిజన్‌తో పాటు మందులు కూడా అందుబాటులో ఉంచాలని సూచించారు. 104 నెంబర్ పై మరోసారి ప్రజలందరికీ విస్తృతమైన అవగాహన కల్పించాలన్నారు. ఎంప్యానెల్ ఆసుపత్రులన్నీ సిద్దమైన తరువాత 104 నంబర్‌పై విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. కోవిడ్ కిట్లను అందుబాటులో వుంచుకోవాలని తెలిపారు. ప్రతి ఆసుపత్రుల్లో అన్ని మౌలిక సదుపాయాలు వుండాలి, ఆరోగ్యమిత్ర సిద్దంగా వుండాలన్నారు. పేషంట్ల నుంచి ఒకసారి ఫోన్ ద్వారా ఫిర్యాదు వచ్చిన తరువాత దానిపైన ఎటువంటి చర్యలు తీసుకున్నామనే దానిపైన యాక్షన్ ప్లాన్ వుండాలని స్పష్టం చేశారు.
కోవిడ్ నివారణ, నియంత్రణపై ప్రజల్లో అవగాహన, ఎడ్యుకేషన్ పెంచాలి సీఎం జగన్ ఆదేశించారు. గుంటూరు, చిత్తూరు, విశాఖ, కృష్ణాల్లో కోవిడ్ కేసులు అధికంగా నమోదవుతున్నాయని అధికారులు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 22 కోవిడ్ కేర్ సెంటర్లు ఉన్నాయన్నారు. కోవిడ్ కేర్ సెంటర్లు కూడా గతంలో ఏ విధంగా సేవలు అందించాయో, ఇప్పుడు కూడా అదే విధంగా పనిచేసేలా సిద్దం చేయాలని సీఎం చెప్పారు. రెమిడెసివీర్ కొరత రాకుండా అవసరమైన డోసులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. కోవిడ్ సమయంలో పనిచేసిన వారికి నియామకాల్లో వెయిటేజీ ఇవ్వడం వల్ల వారిని ప్రోత్సహించినట్లు అవుతుందని సీఎం అభిప్రాయపడ్డారు.