తిరుమల, (ప్రభన్యూస్) : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటిరోజు మంగళవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామివారు ఏడుతలల స్వర్ణశేషవాహనంపై (పెద్ద శేషవాహనం) తిరుమాడ వీధులలో భక్తులను అనుగ్రహించారు. ముఖ్యమంత్రి జగన్ ఈ వాహనసేవలో పాల్గొన్నారు. ఆదిశేషుడు తన పడగ నీడలో స్వామివారిని సేవిస్తూ పాన్పుగా దాస్యభక్తిని చాటుతున్నాడు. ఆదిశేషుడు శ్రీహరికి మిక్కిలి సన్నిహితుడు.
రామావతారంలో లక్ష్మణుడుగా, ద్వాపరంలో బలరాముడుగా శ్రీమన్నారాయణుడికి మిక్కిలి సన్నిహితంగా ఉన్నవాడు శేషుడు. ఈయన భూదేవి సహితుడైన వేంకటేశ్వరుని వహిస్తూ తొలిరోజు భక్తులకు దర్శనమిచ్చారు. బుధవారం ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహనాలపై స్వామివారు కనువిందు చేయనున్నారు. కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.