Saturday, November 23, 2024

క్లీన్‌ ఆంద్రప్రదేశ్‌–జగనన్న స్వచ్ఛ సంకల్పం.. ప్రారంభించిన సీఎం

ఏపీలోని గ్రామీణ, పట్టణ, నగర ప్రజలకు మెరుగైన పారిశుధ్య సేవలు అందించడమే లక్ష్యంగా ‘క్లీన్‌ ఆంద్రప్రదేశ్‌ (క్లాప్‌)–జగనన్న స్వచ్ఛ సంకల్పం’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. విజయవాడ బెంజ్ సర్కిల్ వేదికగా సీఎం ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. స్వచ్ఛ సంకల్పం, క్లాప్ పథకాల అమలులో భాగంగా 4,097 చెత్త సేకరణ వాహనాలను సీఎం జెండా ఊపి ప్రారంభించారు. గార్బేజ్ టిప్పర్ వాహనం, హై ప్రెజర్ క్లీనర్లను సీఎం జగన్​ పరిశీలించారు. గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహాలకు సీఎం నివాళులు అర్పించారు. 100 రోజులపాటు జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం కొనసాగనుంది. 

 మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా తడి, పొడి చెత్తలతో పాటు ప్రమాదకరమైన వ్యర్ధాల సేకరణ కోసం ఇంటింటికి 3 డస్ట్‌ బిన్‌ల చొప్పున పంపిణీ చేయనున్నారు. 123 కార్పొరేషన్‌లు, మునిసిపాలిటీల్లోని 40 లక్షల గృహాలకు 1.20 కోట్ల డస్ట్‌ బిన్‌లు పంపిణీ చేస్తారు. ఇందుకు రూ.100 కోట్ల నిధులను ప్రభుత్వం వెచ్చిస్తోంది.

చెత్త సేకరణ కోసం 5,868 జీపీఎస్‌ ఆధారిత గార్బేజ్‌ టిప్పర్ల ద్వారా గార్బేజ్‌ ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్లకు తరలించేలా ఏర్పాట్లు చేశారు. మెరుగ్గా చెత్త సేకరణ, తరలింపు కోసం 3,097 ఆటో టిప్పర్లు, 1,771 ఎలక్ట్రిక్‌ ఆటోలను పంపిణీ చేయనున్నారు. 231 గార్బేజ్‌ ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్‌ల నుంచి తడి చెత్తను, పొడి చెత్తను వేర్వేరు వాహనాల ద్వారా ఇంటిగ్రేటెడ్‌ సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్రాజెక్ట్‌ల వద్దకు చేర్చనున్నారు. తడి చెత్త నుంచి కంపోస్టు ఎరువు, బయోగ్యాస్ తయారీతో పాటు పొడి చెత్త నుంచి హానికారక వ్యర్ధాలను వేరు చేసి పునర్వినియోగానికి అనుకూలంగా వస్తువులను మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా సామాజిక మరుగుదొడ్లను శుభ్రపరిచేందుకు 10,731 హైప్రెజర్‌ టాయిలెట్‌ క్లీనర్‌ల కొనుగోలు చేశారు.  జన సంచారం అధికంగా ఉన్న ప్రాంతాలలో 1,500 పబ్లిక్‌ టాయిలెట్లు  నిర్మించనున్నారు.

ఇది కూడా చదవండిః హుజురాబాద్ లో టీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్ల వీరే..

Advertisement

తాజా వార్తలు

Advertisement