రాష్ట్ర మంత్రివర్గ పునర్వవస్థీకరణ పేరుతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పద్మవ్యూహంలో చిక్కుకుపోయారని, ప్రస్తుత మంత్రివర్గంలో కీలకమైన ఆరుగురిని తొలగిస్తే ఆయన పదవికి ముప్పు తప్పేలా లేదని కామెంట్ చేశారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య. మంత్రివర్గ ప్రక్షాళన పేరుతో జగన్ ఒకరకంగా తేనేతుట్టెనే కదిలించారని.. 2019 జూన్ 6న ఇచ్చిన మాట ప్రకారం.. రెండున్నరేళ్ల తర్వాత పూర్తి మంత్రివర్గాన్ని మార్చి కొత్తవారికి అవకాశం కల్పిస్తానని చెప్పారన్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను బట్టి చూస్తే కీలకమైన ఓ ఆరుగురు మంత్రులను తొలగిస్తే సీఎంగా జగన్ పీఠం కదిలిపోయేలా ఉందని విమర్శించారు. నిన్న నంద్యాల సభలో ఎవరూ తన వెంట్రుక పీకలేరు అని సీఎం అన్నారు. తాజా పరిస్థితులను బేరీజువేస్తే ఆ మాట మంత్రివర్గం విషయంలో ఆయనకే వర్తించి ఎవరినీ పీకలేని పరిస్థితులు నెలకొన్నాయేమో అని విమర్శలు గుప్పించారు.
కాగా, మంత్రి అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అధికారపార్టీ శాసనసభ్యుల్లో ముఖ్యమంత్రితో సమానమైన బలం ఉందని, ఆయనను తొలగిస్తే జగన్ కు పదవీగండం ఖాయమన్నారు టీడీపీ నేత వర్ల రామయ్య. అదే విధంగా.. బొత్స సత్యనారాయణ కూడా మరో వ్యక్తి అని.. ఈయనకు తెరవెనుక అగ్గిపెట్టడం వెన్నతో పెట్టిన విద్యగా అభివర్ణించారు. వైఎస్ నుంచి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం దాకా కాంగ్రెస్ హయాంలో ఈయన ముఖ్యమంత్రులకు వ్యతిరేకంగా తెరచాటున చేసిన రాజకీయాలు అందరికీ తెలిసిందేనని.. ఈయనను తొలగిస్తే అసంతృప్తివాదులను కలుపుకుని సీఎంపై తిరుగుబాటు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఇక.. ధర్మాన కృష్ణదాస్.. ఈయన ఇప్పటికే ప్రభుత్వ సలహాదారు సజ్జలను కలిసి తన కుటుంబానికి కాకుండా మరొకరికి ఆ జిల్లాలో మంత్రి పదవి ఇస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించినట్లు పత్రికల్లో వార్తలు వచ్చాయని, ఆదిమూలపు సురేష్.. గతంలో ఇన్ కంటాక్స్ విభాగంలో పనిచేసిన నేపథ్యంలో డిల్లీలోని ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఈడి)లోని కొందరు అధికారులతో ఈయనకు సన్నిహిత సంబంధాలున్నాయని, ముఖ్యమంత్రిపై ఉన్న ఈడి కేసుల విచారణ వేగవంతమవుతున్న నేపథ్యంలో సురేష్ ను తొలగిస్తే లాబీయింగ్ చానల్ దెబ్బతిని మొదటికే మోసం రావచ్చని చెప్పుకొచ్చారు వర్ల రామయ్య..
అంతేకాకుండా.. బాలినేని శ్రీనివాసుల రెడ్డి.. ముఖ్యమంత్రి జగన్ కుటుంబంలో విభేదాల తర్వాత తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల హైదరాబాద్ వెళ్లిపోయాక జగన్ వద్ద ఉన్న ఏకైక కుటుంబీకుడని, పైగా సీఎంకు బినామీగా ఉంటూ నల్లధనాన్ని తమిళనాడు మీదుగా విదేశాలకు తరలించి వ్యవహారాలను చక్కబెడుతున్నట్లుగా చెప్పబడుతున్న ఈయనను కదిలిస్తే ఆ డొంక కదిలి సీఎం జగన్ మరికొన్ని కేసుల్లో చిక్కుకునే ప్రమాదం ఉందన్నారు. ఇక.. బూతులమంత్రి కొడాలి నాని విషయానికోస్తే.. ముఖ్యమంత్రి జగన్ తన ప్రత్యర్థి చంద్రబాబును తిట్టడం కోసమే ఆ సామాజికవర్గం నుంచి ఇతడిని పెట్టుకున్నారని, అతడిని తొలగిస్తే మూడేళ్లుగా తనను ముఖ్యమంత్రి ఏవిధంగా ఉపయోగించింది ఆయన బయటపెట్టే అవకాశమున్నందున కొడాలిని తొలగించే సాహసం సీఎం చేయలేరని వెల్లడించారు.
ఇట్లాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి మంత్రివర్గ పునర్వవస్థీకరణ చేయడం కొరివితో తలగొక్కోవడమేనని తెలిపారు టీడీపీ నేత వర్ల రామయ్య. ప్రస్తుతం సీఎం జగన్ పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా తయారైందని, ఇప్పటి పరిస్థితుల్లో ఆయనను ఆ భగవంతుడే కాపాడాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 151మందితో అత్యంత బలమైన వాడిగా చెప్పుకునే సీఎం జగన్ ఇప్పుడు అత్యంత బలహీనుడని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఆరుగురిలో ఏ ఒక్కరినీ తొలగించే ధైర్యం ముఖ్యమంత్రికి లేదని ఎద్దేవా చేశారు వర్ల రామయ్య.