పేదల ఇళ్లకు సర్వ హక్కులు కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాతక్మంగా తీసుకొచ్చిన ఓటీఎస్ పథకం పొడిగించింది. ఏప్రిల్ 2 వరకు ఓటీఎస్ పథకం పొడిగిస్తున్నట్లు సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లాంఛనంగా రిజిస్ట్రేషన్ పట్టాలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ పథకం ద్వారా ఇప్పటికే లబ్ధిపొందిన 8.26 లక్షల మందికి కూడా మంగళవారం నుంచి రిజిస్ట్రేషన్ పట్టాలను అందజేయనున్నారు
సొంతింటి కోసం ప్రతి నిరుపేద జీవితకాలం కృషి చేస్తారని సీఎం జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. ఇల్లంటే ఇటుకలు, స్టీలుతో కట్టిన నిర్మాణం మాత్రమే కాదని, సొంతింటి కోసం వారు సుదీర్ఘకాలం పడిన కష్టానికి ప్రతిఫలం అని జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. పేదల సొంతింటిని నామమాత్రపు ధరకు రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తుంటే మీకెందుకు కడుపు మంట అని అడగాలి అంటూ జగన్ పేర్కొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 52 లక్షల మందికి సర్వహక్కులతో రిజిస్ట్రేషన్ చేయిస్తున్నామని పేర్కొన్న జగన్ ఈ పథకం కింద నిరుపేద ప్రజలకు లబ్ధి జరుగుతుందన్నారు. దాదాపు 10 వేల కోట్ల రుణమాఫీ, 6 వేల కోట్ల రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ చార్జీల మినహాయింపు జరుగుతుందని వెల్లడించారు. నిరుపేదలు తమ సొంత ఇంటిని అవసరాల కోసం కూడా వినియోగించుకోవచ్చని, తనఖా పెట్టుకోవచ్చని, బాగా డబ్బు అవసరమైతే అమ్ముకోవచ్చని జగన్ స్పష్టం చేశారు. అదే సమయంలో ఈ పథకం ద్వారా వీలైనంత ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చాలని భావిస్తున్నామని అందుకే దీన్ని ఉగాది వరకు పొడిగిస్తున్నామని సీఎం జగన్ ప్రకటించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital