ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. సోమవారం ఢిల్లీ వెళ్లి కేంద్రమంత్రులను కలవాలని సీఎం జగన్ భావించారు. అయితే, కేంద్ర మంత్రులు బిజీగా ఉండడంతో సీఎంకు అపాయింట్‌మెంట్లు దొరక్కపోవడంతో పర్యటన వాయిదా పడినట్లు సమాచారం. అయితే సీఎం జగన్ ఈ నెల 10న ఢిల్లీ వెళ్లే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.
పోలవరం ప్రాజెక్టు, విభజన సమస్యలు, వ్యాక్సిన్‌పై చర్చించేందుకు సీఎం జగన్ సోమవారం ఢిల్లీ వెళ్లి కేంద్రమంత్రులను కలవాలని భావించారు. ఇందుకు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. ఇంతలోనే ఆయన పర్యటన వాయిదా పడింది. మరోవైపు వ్యాక్సిన్ల విషయమై ఇప్పటికే అన్నీ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సీఎం జగన్ లేఖలు రాశారు. సీఎంలంతా ఒకే మాట మీద ఉండాలంటూ విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ పై తన బాణీని కేంద్రానికి వినిపించాలని సీఎం జగన్ భావించారని, దాంతోపాటే రాష్ట్రానికి చెందిన పలు అభివృద్ధి పనులు, విభజన హామీలపైనా కేంద్రంతో మాట్లాడేందుకు ఢిల్లీ వెళుతున్నారని ప్రచారం జరిగింది. ముఖ్యంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సీఎం జగన్ భేటీ అవుతారని వార్తలు వినిపించాయి.