నేలటూరులో ఏపీ జెన్ కో మూడో యూనిట్ ని జాతికి అంకితం చేశారు సీఎం జగన్. అనంతరం ఆయన మాట్లాడుతూ..అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్లాంట్ నిర్మాణం జరిగిందన్నారు.ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ వైసీపీ ప్రభుత్వమే ఏర్పడుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాల్లో క్లీన్ స్వీప్ చేయడం పెద్ద కష్టమేమీ కాదన్నారు. అవినీతిరహితంగా పాలిస్తున్నందుకు ప్రజలు మరోమారు తమకే పట్టంకడతారని చెప్పారు. మంచి చేశామని సగర్వంగా తలెత్తుకునేలా మన పరిపాలన జరుగుతోందని వివరించారు. మూడున్నరేళ్ల కాలంలో ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు జగన్ సూచించారు.
ఈ పథకాల ద్వారా లబ్దిపొందిన వాళ్లంతా ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నారని, వాళ్ల ఆశీర్వాదబలంతో వచ్చే 30 ఏళ్లు రాష్ట్రంలో మన ప్రభుత్వమే ఉంటుందని చెప్పారు. ప్రభుత్వ పనితీరు ఇప్పుడు అంతటా కనిపిస్తోందని, గ్రామ సచివాలయాలు, విలేజ్ క్లినిక్స్, ఇంగ్లిష్ మీడియం స్కూళ్లతో పల్లెల వాతావరణమే మారిపోయిందని జగన్ వివరించారు. ప్రభుత్వం చేస్తున్న మంచిపనులను వివరించి చెప్పేందుకే ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమం చేపట్టినట్లు ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. ఇప్పటి నుంచే ఎన్నికల గురించి ఆలోచనలు చేయాలంటూ పార్టీ నేతలు, కార్యకర్తలకు జగన్ సూచించారు. విభేదాలను పక్కనపెట్టి కలిసికట్టుగా పనిచేయాలని పిలునిచ్చారు. ఎన్నికలకు ఇంకా 18 నెలలు ఉందని అశ్రద్ధ చేయొద్దని హెచ్చరించారు. ఈరోజు నుంచే సరిగ్గా పనిచేసుకుంటూ పోతే రాష్ట్రంలో క్లీన్ స్వీప్ చేయగలమని చెప్పారు. ప్రతి పథకాన్ని పారదర్శకంగా అమలు చేశాం. అర్హులెవరూ మిస్ కాకుండా వాలంటీర్లు, సచివాలయం ద్వారా ఇంటింటికీ చేర్చాం. ప్రతి గ్రామంలోనూ 87 శాతం ఇళ్లకు మంచి చేశాం. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఉగాది నుంచి రాష్ట్రవ్యాప్తంగా పూర్తి స్థాయిలో అమలు చేస్తామని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు.