నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు. ఈ సందర్భంగా జగన్ బర్త్ డే వేడుకలను వైసీపీ నేతలు శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నారు. సీఎం జగన్ కు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఇవాళ తన 49వ బర్త్ డే జరుపుకొంటున్నారు.
విశాఖ నగర పార్టీ కార్యాలయంలో ఘనంగా సీఎం జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రి అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు వంశీ, కల్యాణి, మేయర్,జడ్పీ చైర్మన్‌తో కలిసి కేక్ కట్ చేసి మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. విజయవాడలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు కార్పొరేటర్లు, వైఎస్సార్‌సీపీ నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం రోడ్లపై నిద్రిస్తున్న యాచకులకు, వృద్ధులకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. సీఎం జగన్ జన్మదినం సందర్భంగా మంత్రి శంకర నారాయణ అనంతపురం జిల్లా పెనుకొండ బీసీ బాలుర హాస్టల్ విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు.
తండ్రి వారసత్వంతో ప్రత్యక్ష రాజకీయల్లోకి అడుగు పెట్టిన వైఎస్ జగన్.. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ చరిత్రలో ఎవరూ సాధించలేని అద్భుతమైన ఘన విజయాన్ని అందుకున్నారు. ఏకంగా 151 స్థానాల్లో గెలుపొంది ఓ ప్రభంజనం సృష్టించారు. తన తండ్రి వైఎస్ మరణం తర్వాత సొంతగా పార్టీ పెట్టి.. కేసులతో ఎన్ని ఇబ్బందులు పెట్టిన ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఐదేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల ముందు పాదయాత్రతో చరిత్ర సృష్టించారు. అనంతరం అద్భతు విజయం సాధించిన ముఖ్యమంత్రి అయ్యారు.