Thursday, January 30, 2025

AP | నామినేటెడ్ పదవుల భర్తీపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం ఆయన పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, పార్టీ ఇన్‌ఛార్జ్‌లతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

పార్టీ కోసం కష్టపడిన వారికి ప్రాధాన్యత ఇస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా నేతలు, మంత్రుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలు, దేవాలయ కమిటీల నియామకంపై ఎమ్మెల్యేలు సరైన ప్రతిపాదనలు పంపాలని సూచించారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారి కంటే.. ఎప్పటి నుంచో పార్టీలో ఉండి పనిచేసిన వారిని నేతలు ప్రోత్సహించాలని సూచించారు.

214 మార్కెట్ కమిటీలు, 1100 ట్రస్ట్ బోర్డులు ఉన్నాయని.. రానున్న రోజుల్లో ఈ నియామకాలు పూర్తి చేస్తామని చెప్పారు. కష్టపడిన నాయకులు, కార్యకర్తలకు న్యాయం చేసేలా నామినేటెడ్ పదవులు ఇస్తామని అన్నారు. జూన్‌లోపు ప్రభుత్వంలో ఉన్న అన్ని నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని సీఎం స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ వ్యవహారాలు, నేతల పని తీరు వంటి అంశాలపై ఇందులో చర్చించారు.

పదవులు పొందిన వారి రెండేళ్ల పనితీరును సమీక్షిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. దాని ఆధారంగానే కొత్త నిర్ణయాలు, భవిష్యత్ అవకాశాలను ఉంటాయన్నారు. 2029లో మళ్లీ గెలుపొందేలా ప్రతి ఒక్కరూ కసరత్తు చేయాలని దిశానిర్దేశం చేశారు. ఎన్నికల హామీల్లో ఇచ్చిన అన్ని పథకాలను అమలు చేస్తామ‌ని… 7 నెలల్లో అనేక పథకాలు, కార్యక్రమాలు, అభివృద్ధి పనులు చేపట్టామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ విషయాలను ప్రజలకు నిరంతరం వివరించాలని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement