- ఈనెల 13న ప్రారంభం
- ఇందిరా గాంధీ స్టేడియం వేదికగా
- హాజరుకానున్న 25వేల మంది ప్రజలు..
- (ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో ) : ఇందిరా గాంధీ స్టేడియం వేదికగా ఈనెల 13వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చే స్వర్ణాంద్ర @ 2047కి శ్రీకారం చుట్టడం జరుగుతుందని, ఈ సందర్భంగా ఏర్పాటు చేసే సభకు సుమారు 25వేల మంది ప్రజలు హాజరు కానున్నారని, ఇందుకు సంబంధించిన జిల్లా అధికారులు సమన్వయంతో కృషి చేసి కార్యక్రమం విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మిశ అధికారులను ఆదేశించారు. ఈనెల 13వ తేదీన ఇందిరా గాంధీ స్టేడియంలో నిర్వహించనున్నస్వర్ణాంద్ర @ 2047 కార్యక్రమం ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మిశ మంగళవారం నగరంలోని ఆయన క్యాంప్ కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జాయింట్ కలెక్టర్, మున్సిపల్ కమీషనర్, డీసీపీలతో కలిసి జిల్లా స్థాయి అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు.
ఈసందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంద్ర @ 2047 కార్యక్రమానికి ఈనెల 13వ తేదీన ఇందిరా గాంధీ స్టేడియంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టనున్నారన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు కృష్ణా, గుంటూరు, ఎన్‌టిఆర్ జిల్లాల నుండి సుమారు 25వేల మంది ప్రజలు విద్యార్థినీ విద్యార్థులు హాజరు కానున్నారన్నారు. కార్యక్రమం విజయవంతం చేసేలా జిల్లా స్థాయి అధికారులు వారికి అప్పగించిన భాధ్యతలను అత్యంత సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. కార్యక్రమానికి హాజరయ్యే వారి కోసం 500 బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ట్రాన్స్‌పోర్టు ఏపీఆర్డీటీ అధికారులు వాహనాల సమీకరణకు చర్యలు తీసుకోవాలన్నారు. వేదిక బారిగేట్ల నిర్మాణం పనులను ఆర్ అండ్ బీ అధికారులు పర్యవేక్షించి ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఇవ్వాలన్నారు. ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా వాహనాలకు పార్కింగ్ సౌకర్యం, బందోబస్త్ ఏర్పాట్లు చేసేలా పోలీస్ అధికారులు చర్యలు తీసుకుంటారన్నారు.
స్వర్ణాంద్ర @ 2047 కార్యక్రమానికి సంబంధించి 10థీమ్‌ల పై ప్రదర్శనలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఇందుకు అవసరమైన స్టాల్స్‌ను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందిరా గాంధీ స్టేడియం వాహనాల పార్కింగ్ ఏరియాల్లో తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేసి పారిశుద్ద్య పనులు నిర్వహించడంతో పాటు త్రాగునీటి సరఫరా చేసేలా మున్సిపల్, ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. వేదిక స్టాల్స్ ఆలంకరణ పర్యవేక్షణ జిల్లా ఉద్యాన అధికారి చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ నోడల్ అధికారిగా, మున్సిపల్ కమిషనర్ ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తారని ఏర్పాట్లపై ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా తక్షణమే తన దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకుని స్వర్ణాంద్ర @ 2047 విజయవంతానికి కృషి చేయాలని కలెక్టర్ లక్ష్మిశ కోరారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ జాయింట్ కలెక్టర్ నిధి మీనా, మున్సిపల్ కమిషనర్ హెచ్‌యం ధ్యానచంద్ర, డీసీపీ గౌతమి శాలిని, డీఆర్‌వో లక్ష్మి నరసింహం, ఆర్‌డీవో చైతన్య, ఐసీడీఎస్ పీడీ ఉమాదేవి, డీఎం అండ్ హెచ్‌వో డా.యం.సుహాసిని, జిల్లా ఉద్యాన అధికారి బాలాజీ కుమార్, డీఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు, డీఈవో యు.వి.సుబ్బారావు, ఆర్‌డబ్య్లుఎస్ ఎస్‌ఇ ఎస్.వి.సాగర్, డీసీవో శ్రీనివాసరెడ్డి, ఆర్యోగ్యశ్రీ కో ఆర్డినేటర్ జె.సుమన్, జిల్లా పౌర సరఫరాల అధికారి టి.సతీష్, సీపీవో వై.శ్రీలత, జిల్లా వ్యవసాయ అధికారిణి, విజయకుమారి, ఉన్నారు.