Saturday, January 4, 2025

AP | జగన్మాతను దర్శించుకున్న సీఎం చంద్రబాబు..

(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో) : కొత్త సంవత్సరంలో రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరగడంతో పాటు రాష్ట్రం అన్ని రంగాల్లో సంపూర్ణ అభివృద్ధి సాధించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర‌ స్వామి వార్ల దేవస్థానంలో కొలువైయున్న జగన్మాతను సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం ప్రత్యేకంగా దర్శించుకున్నారు. నూతన సంవత్సరం ప్రారంభం రోజున అమ్మవారి ఆలయానికి వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడుకు జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, ఎండోమెంట్ ప్రిన్సిపల్ కమిషనర్ సత్యనారాయణ, ఆలయ ఇన్చార్జి ఈవో రామచంద్ర మోహన్ తో పాటు ఇతర అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.

అమ్మవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం వేద ఆశీర్వచన మండపం వద్ద వైదిక కమిటీ సభ్యుడు శంకర్ శాండిల్య నేతృత్వంలో వైదిక కమిటీ, వేద పండితులు సీఎం చంద్రబాబుకు వేద ఆశీర్వచనం చేశారు. అమ్మవారి చిత్రపటం ప్రసాదాలను కమిషనర్ సత్యనారాయణ ఇన్చార్జి ఈఓ కేఎస్ రామారావు అందజేశారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ… ఈ ఏడాది తెలుగు ప్రజలందరికీ విజయాలే చేకూరుతాయని, భవిష్యత్తు అంతా బంగారు బాటేనని చెప్పారు. ఈ పర్యటనలో సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు హోంమంత్రి వంగలపూడి అనిత, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఈఓ కేఎస్ రామారావు, మాజీ జడ్పీ చైర్ ప‌ర్స‌న్ గద్దె అనురాధ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గన్నేప్రసాద్, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, ఇతర టీడీపీ నేతలు, అధికారులు, దేవస్థానం అధికారులు, సిబ్బంది ఉన్నారు.

- Advertisement -

అనంతరం  ముఖ్యమంత్రి చంద్రబాబు దుర్గగుడి నుంచి నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లారు. ఏపీ గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్‌తో సీఎం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు సీఎం చంద్రబాబు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement