Sunday, November 17, 2024

AP | గవర్నర్‌ తో సీఎం చంద్రబాబు భేటీ.. గంటన్నరకు పైగా సమావేశం !

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో త్వరలో నిర్వహించబోయే అసెంబ్లి బడ్జెట్‌ సమావేశాలు, శాంతి భద్రతల స్థితిగతులపై రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుదీర్ఘంగా చర్చించారు. మంగళవారం సాయంత్రం సతీమణి భువనేశ్వరితో కలిసి విజయవాడలోని రాజ్‌ భవన్‌కు చేరుకున్న చంద్రబాబు నాయుడు గవర్నర్‌ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఇటీవల అస్వస్థకు గురైన గవర్నర్‌ సతీమణి సమీరా నజీర్‌ ఆరోగ్య పరిస్థితిని గురించి సీఎం చంద్రబాబు, భువనేశ్వరి అడిగి తెలుసుకొని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ నజీర్‌తో సీఎం చంద్రబాబు గంటన్నరకు పైగా ఏకాంత భేటీ జరిపారు.

త్వరలోనే నిర్వహించనున్న శాసనసభ సమావేశాలకు గవర్నర్‌ను ఆహ్వానించినట్లు తెలిసింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశ పెట్టకపోవడంతో రానున్న బడ్జెట్‌ సమావేశాల్లో పెట్టనున్నారు. రూ.2లక్షల కోట్లతో బడ్జెట్‌ ప్రవేశ పెట్టనున్న నేపధ్యంలో ఆయా రంగాలకు ఇచ్చిన ప్రాధాన్యతలను గవర్నర్‌కు వివరించారు.

రాష్ట్రంలో శాంతి భద్రతల స్థితిగతులపై కూడా వీరిద్ధరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఇటీవల రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను సీఎం గవర్నర్‌కు వివరించారు.

రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, అందుకు సంబంధించిన కేసులపై తీవ్ర రాజకీయ దుమారం రేగుతుండటంతో నిందితులను అరెస్టు, చట్టపరంగా వారిపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను సైతం గవర్నర్‌కు సీఎం చంద్రబాబు వివరించారు.

- Advertisement -

కాగా అసెంబ్లీ సమావేశాల పైనే వీరిద్దరి మధ్య ఎక్కువ చర్చ జరిగినట్లు తెలుస్తోంది. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన రెడ్డితో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హజరవ్వడంపై సందిగ్దత నెలకొంది.

అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రమాణ స్వీకారానికి వచ్చిన జగన్మోహన రెడ్డి ఆ తర్వాత రాలేదు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు సైతం ఇదే పరిస్థితి. ఈ సమావేశాలకు కూడా జగన్మోహన రెడ్డి రాకపోవచ్చనే ఊహాగానాలు వస్తున్నాయి. దీనిపై వీరిద్దరు కొంత సేపు చర్చించినట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement