విజయవాడలో సోమవారం ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సెమీ క్రిస్మస్ వేడుకలను మీ అందరితో కలిసి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు కేట్ కట్ చేశారు. లోక రక్షకుడైన ప్రభువు కరుణ మనందరిపై ఉండాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు.
క్రిస్టియానిటీ… కరుణ, ప్రేమ, సేవకు ప్రతీక అని అన్నారు. స్వాతంత్య్రానికి పూర్వం నుంచే క్రైస్తవ విద్యాసంస్థలు, ఆసుపత్రులు దేశ ప్రజలకు సేవలందిస్తున్నాయని వివరించారు. ఎన్టీఆర్ కూడా గుంటూరు ఏసీ కాలేజీలోనే చదువుకున్నారని చెప్పారు. క్రైస్తవులకు కూటమి ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
గుంటూరులో క్రైస్తవ భవనాన్ని మేం పూర్తి చేసి తీరతామన్నారు. క్రిస్టియన్ మిషనరీస్ ప్రోపర్టీస్ డెవలెప్మెంట్ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. చర్చిల నిర్మాణానికి, పునరుద్ధరణకు ఆర్థిక సాయం అందిస్తామన్నారు. క్రైస్తవ స్మశాన వాటికల నిర్మాణానికి కృషి చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
ఐదేళ్ల విధ్వంసానికి పరిష్కారం దొరకట్లేదు
అయితే ఈ సందర్భంగా గత పాలకులపై చంద్రబాబు మండిపడ్డారు… నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాక దూసుకుపోవాలనే మనస్తత్వం మనస్తత్వం ఉన్నప్పటికీ ఆ వెసులుబాటు లేకుండా పోయిందన్నారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన తనకు లేని కష్టాలు ఈసారి ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.
గత 6 నెలల నుంచి రాత్రి పగలు కష్టపడి పరిశోధనలు చేసినా గత ఐదేళ్ల విధ్వంసానికి మార్గం దొరకడం లేదన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా రాష్ట్రాన్ని బాగు చేయాలన్న లక్ష్యాన్ని వదులుకునే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఆర్థిక అసమానతలను తగ్గించేందుకు కలిసికట్టుగా పని చేద్దామని చంద్రబాబు పిలుపునిచ్చారు.
రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకురావడం తన బాధ్యత అని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. విజయవాడలో జరిగిన ఈ సెమీ క్రిస్మస్ వేడుకల్లో మంత్రులు సవిత, కొల్లు రవీంద్రతోపాటు స్థానిక ఎంపీ కేశినేని శివనాథ్ తదితరులు పాల్గొన్నారు.