Friday, September 20, 2024

AP | అడవుల్లో అడుగుపెడితే అదే చివరి రోజు.. స్మగ్లర్లకు చంద్రబాబు వార్నింగ్

మంగళగిరి ఎయిమ్స్‌లోని వ‌ద్ద ఎకో పార్కులో (శుక్రవారం) ఏర్పాటు చేసిన వన మహోత్సవ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు.. వేప, రావి చెట్లను నాటారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఏటా కనీసం రెండు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

ఒకప్పుడు ఇంకుడు గుంతలు తవ్వితే ఎగతాళి చేశారు..

వన మహోత్సవం ఎంతో మహత్తరమైన కార్యక్రమం అని.. ఏ పని చేసినా పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుంటామని తెలిపారు. పచ్చదనం ఆవశ్యకతని విద్యార్థులంతా గ్రహించాలని అన్నారు చంద్రబాబు. రాష్ట్రంలో పచ్చదనం 50% పెరగాలన్నారు. ఇందుకోసం ప్రతి ఒక్కరూ ఏటా రెండు మొక్కలు నాటాలని సూచించారు.

ఒకప్పుడు ఇంకుడు గుంతలు తవ్వితే చాలామంది ఎగతాళి చేశారని.. కానీ భూగర్భ జలాలు పెరగాలంటే ఇంకుడు గుంతలు చాలా అవసరం అన్నారు. పవన్‌ కల్యాణ్ వద్ద అటవీ, నరేగా శాఖలు ఉన్నాయి. రెండు శాఖల సాయంతో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలన్నారు.

అడవుల్లో అడుగుపెడితే అదే చివరి రోజు

- Advertisement -

అటవీ ప్రాంతం క్రమంగా తగ్గిపోతుందని.. పర్యావరణంలో పెను మార్పులు వస్తున్నాయన్నారు చంద్రబాబు. వైసిపి హయాంలో నదులు, చెరువులు, కొండలను ధ్వంసం చేశారని అన్నారు. ఇకనుండి అడవుల్లో అడుగుపెడితే స్మగ్లర్లకు అదే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు.

మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉద్యమంలా తీసుకెళ్తామన్నారు. 2014లో హరితాంధ్రప్రదేశ్‌లో మిషన్‌ను ప్రారంభించామని.. డ్రోన్‌లతో సీడ్ బాల్స్ నాటే కార్యక్రమాలు చేపడతామన్నారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో న‌గ‌ర వనాలు ఏర్పాటు చేస్తామ‌ని తెలిపారు. జపాన్ మియావాకీ విధానంలో పచ్చదనాన్ని పెంచుతామని చంద్రబాబు చెప్పారు.

మొక్కలు నాటడం సామాజిక బాధ్యతగా భావించాలి

సహజ అందాలతో వచ్చే అనుభూతి ఎంతో సంతృప్తి ఇస్తుందని ఉప ముఖ్య మంత్రి పవన్‌ కల్యాణ్ అన్నారు. చెట్లు పెంచడాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని కోరారు. ”దాదాపు కోటి మొక్కలు నాటే ప్రయత్నం శాఖాపరంగా చేస్తున్నాం. ప్రస్తుతం 29 శాతం ఉన్న పచ్చదనాన్ని 50శాతానికి తీసుకెళ్లే దిశగా కృషి చేస్తున్నాం. ఈ మహాయజ్ఞాన్ని సామాజిక బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరూ కలిసి రావాలి. గత ప్రభుత్వం ఇష్టారీతిన చెట్లు నరికేసింది. చెట్టుని కూల్చటం తేలిక.. పెంచటం కష్టమని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. ఇవాళ నాటే ప్రతి మొక్క భావితరాల కోసమే. అడవి వాతావరణం పరిరక్షించుకుంటే తప్ప భవిష్యత్తు మనుగడ లేదు” అని పవన్‌ కల్యాణ్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement