తిరుమల, ప్రభన్యూస్ : తిరుమలలో శుభ్రత, సుందరీకరణ చాలా బాగున్నాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి.రమణ మెచ్చుకున్నారు. రెండేళ్ళ తరువాత రోజు వేలాది మంది సామాన్య భక్తులకు సర్వదర్శన భాగ్యం కల్పించడం సంతోషకరమన్నారు. ఆదివారం ఉదయం శ్రీవారిని ద ర్శించుకున్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. శ్రీవారి ఆశీస్సులు అందుకుని భక్తులు ఆనందించే వాతావరణం ఏర్పడిందన్నారు. భవిష్యత్తులో కోవిడ్ లాంటి వ్యాదులు సోకకుండా ప్రపంచాన్ని కాపాడాలని స్వామివారిని ప్రార్ధించినట్లు చెప్పారు. అంతకుముందు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి.రమణ ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. సతీసమేతంగా ఆలయం వద్దకు వచ్చిన జస్టిస్‌కు టిటిడి చైర్మెన్ వైవి.సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి సాదరంగా ఆహ్వానించగా అర్చకులు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు.
అనంతరం ఆలయ ధ్వయస్తంబానికి నమస్కరించి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయంలోని రంగనాయకుల మండపంలో చీఫ్ జస్టిస్‌కు వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా టిటిడి చైర్మెన్ వైవి.సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ఏవి.ధర్మారెడ్డి శ్రీవారి తీర్థ ప్రసాదాలు, ఆంజనేయుని జన్మస్థలం పై టిటిడి ముద్రించిన పుస్తకం అందచేశారు. శ్రీవారి దర్శనం అనంతరం జస్టిస్ దంపతులు శ్రీభేడిఆంజనేయస్వామివారిని దర్శించుకున్నారు. తరువాత అఖిలాండం వద్ద కర్పూరం వెలిగించి కొబ్బరికాల కొట్టారు. తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్‌రెడ్డి, సివిఎస్‌వో గోపినాథ్‌జెట్టి, డిప్యూటిఈవోలు హరీంధ్రనాథ్, లోకనాథం, విజివో బాలిరెడ్డి పాల్గొన్నారు.