Saturday, November 23, 2024

ఐఆర్‌ఎస్‌ కృష్ణకిశోర్‌కు క్లీన్‌చిట్‌.. సీఐడీ కేసు కొట్టివేత

అమరావతి, ఆంధ్రప్రభ: ఐఆర్‌ఎస్‌ అధికారి జాస్తి కృష్ణకిషోర్‌కు హైకోర్టు క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. ఆయనపై సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలి (ఏపీఈడీబీ) సీఈఓగా నిధుల దుర్వినియోగంతో పాటు అక్రమాలకు పాల్పడ్డారంటూ ఏపీఈడీబీ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ ఇచ్చిన ఫిర్యాదును అనుసరించి 2019 డిసెంబర్‌ లో ఆయనపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. తెలుగుదేశం పార్టీకి సన్నిహితంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే తనపై అక్రమంగా నమోదుచేసిన కేసును కొట్టేయాలని కోరుతూ ఆయన హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ జరుపుతున్న ఉన్నత న్యాయస్థానం ఆయనపై ఎలాంటి కఠిన చర్యలు చేపట్టరాదని సీఐడీ పోలీసులను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ దొనడి రమేశ్‌ ఈ ఏడాది మార్చి 31వ తేదీన తుది విచారణ జరిపి తీర్పును రిజర్వు చేశారు. తాజాగా వెలువరించిన తీర్పులో పిటిషనర్‌ జాస్తి కృష్ణకిశోర్‌ అక్రమాలకు పాల్పడినట్లు ఆధారాలు చూపకపోవటంతో అవి నిరాధారమైనవిగా భావిస్తూ సీఐడీ కేసును కొట్టేస్తున్నట్లు ప్రకటించారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా, అక్రమాస్తుల కేసులో విచారణ జరిపిన సీబీఐ రిటైర్డు జేడీ లక్ష్మీనారాయణకు జాస్తి కృష్ణకిశోర్‌ సన్నిహితుడని కూడా సీఐడీ అభియోగాలు మోపింది. వ్యక్తులు, సంస్థల అక్రమ, చట్ట వ్యతిరేక కార్యకలాపాల గురించిన సమాచారాన్ని అందించే వ్యవస్థ (విజిల్‌ బ్లోయర్‌) ఇచ్చిన సమాచారం ఆధారంగానే కృష్ణకిషోర్‌పై కేసు నమోదు చేసినట్లు ఉన్నత న్యాయస్థానం గుర్తించింది. దీన్నిబట్టి సంబంధంలేని ఇతర కారణాలతో ఆయనపై కేసు నమోదు చేశారనే అభిప్రాయాన్ని న్యాయమూర్తి తీర్పులో స్పష్టం చేశారు. పిటిషనర్‌పై దురుద్దేశపూర్వక, కుట్రపూరితకేసు నమోదుచేశారని భావించినప్పుడు సీఆర్‌పీసీ 482 సెక్షన్‌ కింద హైకోర్టు స్వతసిద్ధ అధికారాలతో కేసును కొట్టేయవచ్చని కృష్ణ కిశోర్‌పై నమోదు చేసిన కేసును కూడా ఇదే సెక్షన్‌ కింద కొట్టేస్తున్నట్లు వివరించారు. ప్రజాధనం దుర్వినియోగం, అక్రమాలకు సంబంధించి సీఐడీ ఎలాంటి సాక్ష్యాధారాలను చూపలేకపోోయిందని అందువల్ల నిరాధార ఆరోపణలతో కేసు నమోదు చేసినట్లుగా భావిస్తూ కేసును కొట్టేస్తూ తీర్పును వెలువరించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement