Saturday, November 23, 2024

Delhi: ఏపీకి స్వచ్ఛ అవార్డుల పంట.. 11 పట్టణ, స్థానిక సంస్థలకు పురస్కారాలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్వచ్ఛ అవార్డుల పంట పండింది. 11 పట్టణ స్థానిక సంస్థలకు స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు దక్కాయి. న్యూఢిల్లీ తాల్ కటోరా స్టేడియంలో శనివారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా పాల్గొని అవార్డులను ప్రదానం చేశారు. స్వచ్చత,పరిశుభ్రత అంశాల్లో అత్యుత్తమంగా నిలిచిన మున్సిపాలిటీలు, నగరాల ప్రతినిధులకు ఈ అవార్డులను అందజేశారు.

రాష్ట్రపతి చేతుల మీదుగా రాష్ట్ర మున్సిపల్, పట్టణ శాఖ మంత్రి ఆదిమూలుపు సురేష్, పట్టణ స్థానిక సంస్థల ప్రతినిధులు స్వచ్ఛ అవార్డులను అందుకున్నారు. పురస్కారాలు అందుకోవడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం అనంతరం మంత్రి సురేష్ ఏపీ భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గతంలో ఎన్నడూ లేని విధంగా 11 అవార్డులు వచ్చాయని, ఇదంతా స్థానిక యంత్రాంగం, అధికారులు, అన్ని వ్యవస్థల కృషితో అని సంతోషం వ్యక్తం చేశారు.

తిరుపతి మున్సిపల్ కార్పోరేషన్ కు సఫాయి మిత్ర మున్సిపల్ కార్పొరేష్ కింద మొదటి ర్యాంక్ వచ్చిందని, క్లీన్ మున్సిపాలిటీగా విజయవాడ,క్లిన్ బిగ్ సిటీగా విశాఖపట్నం అవార్డు అందుకుందని చెప్పారు. పులివెందులకు బెస్ట్ ఇన్నోవేషన్ అవార్డు, పుంగనూరుకు బెస్ట్ సిటిజన్ ఫీడ్ బ్యాక్ అవార్డు వచ్చిందని తెలిపారు. విశాఖపట్నం టాప్ ఇంపాక్ట్ క్రియేటర్ గా పురస్కారాన్ని సాధించిందని, శ్రీకాకుళం మున్సిపాలిటికి రెండు అవార్డులు వచ్చాయని వెల్లడించారు. గార్బేజ్ ఫ్రీ సిటీగా విశాఖ,తిరుపతి,విజయవాడకు ఫైవ్ స్టార్ సిటీ అవార్డులు వచ్చాయని మంత్రి వివరించారు.

- Advertisement -

దేశంలో ఆల్ ఇండియా టాప్ టెన్ నగరాల్లో మూడు నగరాలు విశాఖ, తిరుపతి, విజయవాడ ఉన్నాయన్నారు. టాప్ 100లో 7 సిటీలు ఉన్నాయని సురేష్ చెప్పారు. కర్నూలు, తిరుపతి, నెల్లూరు, కడప,రాజమండ్రి, జీవీఎంసీ,ఎంవీఎంసీ ఉన్నాయని తెలిపారు. క్లీన్ ఏపీలో భాగంగా గడిచిన మూడేళ్ళలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ఆధారంగా బెస్ట్ ప్రాక్టిసెస్ కి కేంద్రం అవార్డులు ఇచ్చిందని సురేష్ తెలిపారు. వాలంటీర్ల వ్యవస్థ ఎంతో ఉపయోగకరంగా ఉందని, పట్టణీకరణ సమస్య కాదన్న మంత్రి,
పట్టణీకరణను ఒక ప్రాంతానికి పరిమితం చేయకూడదని అభిప్రాయపడ్డారు.

ఏపీలో అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీస్ పెంచామని, పట్టణ గార్బేజ్ ను ప్రత్యామ్నాయ వనరుల ఏర్పాటుకు ఉపయోగిస్తున్నామని అన్నారు. ఓపెన్ డేఫికేషన్ ఫ్రీ , మురుగు నీటి శుద్ధి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. క్లీన్ ఏపీ కార్యక్రమంపై నిఘా పెడుతున్నామని, రియల్ టైమ్ మానిటరింగ్ చేస్తున్నామని ఆయన అన్నారు. అన్ని జిల్లాలను స్మార్ట్ సిటీలుగా తయారు చేసేందుకు కృషి చేస్తున్నామని సురేష్ స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement