(విజయవాడ, ఆంధ్రప్రభ) : ఏపీలో పదోతరగతి ఎస్ఏ 1 గణితం పరీక్ష పేపర్ లీక్ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 16న జరగాల్సిన 10వ తరగతి గణితం ఎస్‌ఏ-1 పరీక్ష పేపర్‌ను… పరీక్షకు ముందు రోజు సాయంత్రం కొన్ని అనధికార యూట్యూబ్ ఛానెల్‌లలో పోస్ట్ చేయడంపై ఫిర్యాదు నమోదైంది.
దీంతో పరీక్ష పేపర్ లీక్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా సైబర్ క్రైమ్ పోలీస్ లకు అదే రోజు ఫిర్యాదు అందింది. ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేపట్టి మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ బాలుడు మ్యాథమెటిక్స్ ఎస్ ఏ-1 గణితం పరీక్ష పేపర్ ను యూట్యూబ్ లో పోస్ట్ చేసినట్లు గుర్తించారు.
ఆ బాలుడిని విచారించగా.. అతను విజయవాడకు చెందిన ఒక బాలుడి టెలిగ్రాం ఛానల్ నుండి పరీక్ష పేపర్ పొందినట్లు తెలిపాడు. అయితే ఆ టెలిగ్రాం ఛానల్ వివరాలను సేకరించి దర్యాప్తు చేయగా, అంబేద్కర్ కోనసీమ జిల్లా, రామచంద్రాపురం మండలంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ లో సోషల్ స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న తీపర్తి వీరవెంకట సుబ్బారావు పేపర్ లీక్ చేయడానికి కారణమని గుర్తించారు.
ఈ క్రమంలో సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా… రామచంద్రాపురంలోని ఎంఈవో కార్యాలయం నుంచి పాఠశాలకు ప్రతి పరీక్షకు ప్రశ్నపత్రాలను తీసుకురావడానికి తమ పాఠశాల తరపున వెంకట సుబ్బారావు వెళ్తున్నట్లు నిర్ధారణ అయింది.
తన పాఠశాలలో చదువుతున్న పిల్లలు ఎక్కువ మార్కులు తెచ్చుకుని పాఠశాల ప్రతిష్టను పెంచాలని… ఉద్దేశపూర్వకంగానే రామచంద్రాపురం ఎంఈవో శ్రీనివాసరావుతో కలిసి గణితం పరీక్ష పేపర్ ను దొంగలించినట్టు నిర్ధారించారు.
ఈ నేపథ్యంలో గణితం పరీక్ష ప్రశ్నపత్రాన్ని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన అరుణ్‌కుమార్‌తో పాటు.. పేపర్ లీక్ చేసిన రామచంద్రపురానికి చెందిన తిప్పర్తి వీర వెంకట సుబ్బారావు, ఎంఈవో మానుపూడి శ్రీనివాసరావులను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.