అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఉపాధ్యాయుల బదిలీలపై అధికారులు స్పష్టత ఇవ్వాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎల్. సాయి శ్రీనివాస్, హెచ్.తిమ్మన్నలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మున్సిపాలిటీల్లో ఉపాధ్యాయుల బదిలీలకు హడావిడిగా షెడ్యూల్ ఇచ్చి వాయిదా వేశారని, బదిలీల నిమిత్తం ప్రభుత్వం 2021లో విడుదల చేసిన జి.వో.125లో మార్గదర్శకాలు ఇవ్వడం జరిగిందని, దీని వలన 2019 నాటికి 8 సంవత్సరాలు నిండిన ఉపాధ్యాయులు బదిలీ కావాలని, 2019 అక్టోబరు1 నాటికి 2 సంవత్సరాలు సర్వీసు ఉన్న ఉపాధ్యాయులు బదిలీ నుండి మినహాయింపు పొందవచ్చని, 2019 అక్టోబరు1వ తేది నాటికి 2 సం వత్సరాలు పూర్తియిన ఉపాధ్యాయులు బదిలీకి అర్హులని పేర్కొనడం జరిగిందన్నారు.
ఈ విషయమై రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్‌టియు) డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, బదిలీలకు 2022 జూన్ తేదీని ప్రామాణికంగా తీసుకోవాలని కోరారు. ప్రధానోపాధ్యాయులకు జీతాలు డ్రాయింగ్ పవర్, ఉపాధ్యాయులకు పి.ఎఫ్ అక్కౌంట్స్ తెరవాలని, ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలల్లో చివరి పనిదినం రోజున అన్ని డిప్యూటేషన్స్ రద్దయ్యాయని, అదేవిధంగా మున్సిపల్ పాఠశాలల్లో ఉన్న డిప్యూటేషన్లు వెంటనే రద్దు చేయాలని ఎస్‌టియు డిమాండ్ చేస్తోందన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.