రాష్ట్రంలో రైతుభరోసా కేంద్రాల (ఆర్బీకే) ద్వారా ధాన్యం సేకరణ చురుగ్గా సాగుతోందని పౌర సరఫరాల శాఖ కమిషనర్ గిరిజాశంకర్ తెలిపారు. రాష్ట్రంలోని 4 వేల 813 రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి రైతుల నుండే ప్రభుత్వం నేరుగా ధాన్యం కొనుగోలు చేసే నూతన విధానాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం 2013-14వ సంవత్సరంలో ప్రవేశపెట్టిన వికేంద్రీకృత సేకరణ విధానంలో భాగంగా రైతుల ముంగిళ్లలోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్ణయించిందని, అయితే ఇప్పటి వరకూ 17.09 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 2,35,886 రైతుల నుండి సేకరించినట్లు చెప్పారు. ఇందుకు గాను 76 వేల 158 మంది రైతులకు రూ.1,153 కోట్లను నేరుగా వారి బ్యాంకు ఖాతాలకే జమ చేశామన్నారు.
రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల్లోనే ఈ సొమ్మును రైతుల ఖాతాల్లోకి నేరుగా జమచేస్తున్నామన్నారు. మిగిలిన ధాన్య సేకరణ లక్ష్యాన్ని కూడా రానున్నరెండు మాసాల్లో పూర్తిచేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ప్రమాణాలకు లోబడి ధాన్యం కొనుగోలుకై కనీస మద్దతు ధరను ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. గ్రేడ్-ఏ కేటగిరీ క్రిందకు వచ్చే ధాన్యం క్వింటాల్ ధరను రూ.1,960, 75 కేజీలకు రూ.1,470, కామన్ కేటగిరీలో ధాన్యం క్వింటాల్ ధరను రూ.1,940, 75 కేజీలకు రూ.1,455గా ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆయన వివరించారు. ఆ రేట్ల ప్రకారమే రైతులు విక్రయించే ధాన్యం ధరలను నిర్ణయిస్తూ వారికి చెల్లింపులు 21 రోజుల్లోనే చేయడం జరుగుచున్నదన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital