Thursday, November 21, 2024

Civil Aviation – కేంద్ర మంత్రిగా బాధ్య‌తలు స్వీక‌రించిన రామ్మోహ‌న్ నాయుడు

ఢిల్లీలోని కేంద్ర కార్యాలయంలో రామ్మోహన్ నాయుడు కేంద్ర పౌరవిమానయాన మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. అంతకు ముందు తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన కేంద్రమంత్రిగా పలు ఫైళ్లపై సంతకాలు చేశారు. అనంతరం మంత్రికి సహాయ మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను ఎల్లప్పుడు శ్రీకాకుళం ప్రజలకు రుణపడి ఉంటానని తెలిపారు. అలాగే కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. పిన్నవయస్కుడైన నాపై అతి పెద్ద బాధ్యతలు పెట్టారని, వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలిపారు. దేశంలో యువతకు మోదీ ఎంత ప్రాధాన్యత ఇస్తారో తనని చూస్తే అర్థమవుతుందని.. తన తండ్రి ఎర్రన్నాయుడిని స్మరించుకుంటూ బాధ్యతలు చేపట్టినట్లు తెలిపారు.

- Advertisement -

100 రోజుల ప్ర‌ణాళిక‌

100 రోజుల ప్రణాళిక తయారు చేసి, దాన్ని అమల్లోకి తీసుకువస్తామని రామ్మోహన్ తెలిపారు. టెక్నాలజీ వినియోగంతో పౌరవిమానయానాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని చెప్పారు. సామాన్య ప్రయాణికుల కోసం ఈజ్ ఆఫ్ ఫ్లయింగ్ పై దృష్టి పెడతామని, ఎయిర్ పోర్టుల నిర్మాణం వేగవంతం చేస్తామని వివరించారు. భోగాపురం ఎయిర్ పోర్టును త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పారు. విజయవాడ, తిరుపతి ఎయిర్ పోర్టులకు కనెక్టివిటీ పెంచేందుకు కృషి చేస్తానని తెలిపారు.

అదే సమయంలో పర్యావరణ హితంగా మంత్రిత్వ శాఖను నిర్వహిస్తామని కేంద్ర‌మంత్రి పేర్కొన్నారు. సమర్థ నాయకత్వం ఎలా ఉండాలి అనేది చంద్రబాబు నుంచి నేర్చుకున్నానని తెలిపారు. 2014లో పౌరవిమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అశోక్ గజపతిరాజు మంచి పునాదులు వేశారని వెల్లడించారు. ఉడాన్ స్కీమ్ కూడా అశోక్ గజపతిరాజు హయాంలోనే వచ్చిందని రామ్మోహన్ నాయుడు వివరించారు. అనుభవం కోసం జ్యోతిరాదిత్య సింథియా నుంచి కూడా కొంత సమాచారం తీసుకున్నానని వెల్లడించారు. గత పథకాలను కొనసాగిస్తూ, మరిన్ని పథకాలు తీసుకువస్తామని చెప్పారు. విజనరీ నాయకులు మోదీ, చంద్రబాబు నుంచి చాలా నేర్చుకోవచ్చని అన్నారు. దేశ ప్రజలంతా గర్వించేలా పనిచేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తానని తెలిపారు. అలాగే తనకు ఈ స్థాయి గౌరవం దక్కినందుకు సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement