అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో నేటికీ వెట్టి చాకిరి వ్యవస్ధ కొనసాగుతోంది. దేశంలోనే ఏపీని వెట్టి చాకిరి రహిత రాష్ట్రంగా మార్చేందుకు జగన్ సర్కార్ ఇటీవల ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. దీంతో రంగంలోకి దిగిన రాష్ట్ర పోలీసుశాఖ ఆధ్వర్యాన సీఐడి విభాగం ఈ వెట్టి చాకిరి వ్యవస్ధ నిర్మూలన కోసం ‘ఆపరేషన్ సేచ్చ అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీనిలో భాగంగా వారం రోజుల పాటు ఈనెల 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు అన్ని జిల్లాలోని ఇతర శాఖల సమన్వయంతో రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ కొనసాగిస్తోంది. వెట్టి చాకిరి నిర్మూలన చట్టం దేశంలో అమలులోకి వచ్చి 45 ఏళ్లు గడుస్తున్నా బీహార్, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో నేటికీ బాండెడ్ లేబర్ విధానం కొనసాగుతూనే ఉంది. మన రాష్ట్రంలో కూడా వెట్టి చాకిరి వ్యవస్ధ ఆయా రాష్ట్రాల తర్వాత స్థానంలో ఉన్నప్పటికీ ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చి బాండెడ్ లేబర్ గా జీవితాలు కొనసాగిస్తున్న వారి సంఖ్యే ఎక్కువ. అదేవిధంగా మన రాష్ట్రంలోని వెనుకబడిన కొన్ని జిల్లాల్లో, ఆయా జిల్లాల నుంచి ఇతర ప్రాంతాలకు వలస వస్తున్న క్రమంలో వాంటెడ్ లేబర్ కాన్సెప్ట్ వేళ్ళూనుకుపోయింది.
ఈక్రమంలో మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ, కార్మిక శాఖ వంటి సంబంధిత డిపార్టుమెంట్‌లు ఉదాసీనత వల్ల కూడా వెట్టి చాకిరి వ్యవస్ధ బలపడిపోతూ ఉంది. పైగా ఉపాధి కల్పన కూడా నామమాత్రమైనందున బాండెడ్ లేబర్‌కు కారణాలుగా సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో పోలీసుశాఖ ఈ దిశగా దృష్టి సారించడం ప్రస్తుతం అనివార్యమైంది. వెట్టి చాకిరిని ప్రోత్సహిస్తున్న వారు మూడేళ్ళ జైలుశిక్ష, జరిమానాతో పాటు- సెక్షన్ 9, సబ్ సెక్షన్ 2 ఆఫ్ బాండెడ్ లేబర్ సిస్టమ్ (అబాలిషన్) యాక్ట్ 1976 కింద శిక్షార్హులు. ఈ బాండెడ్ లేబర్ వ్యవస్థ అనేక సందర్భాల్లో సెక్స్, బాల కార్మికుల కోసం మానవ అక్రమ రవాణాకు దోహదం చేస్తోంది. దురదృష్టవశాత్తూ న్యాయస్థానాల్లో జాప్యం కారణంగా ఈ బాండెడ్ లేబర్ నేరాలలో శిక్షల రేటు- చాలా తక్కువగా ఉంటోంది. అదేవిధంగా ఈ బంధిత కార్మికులలో చాలా మంది వలస స్వభావం కలిగిన వారు కావడం వల్ల వారు రక్షించబడి వారి స్వస్ధలాలకు పంపిన తర్వాత కేసు విచారణలో కోర్టుల వరకు తీసుకురావ డం కష్టతరమవుతోంది. దీని వల్ల వెట్టి చాకిరికి ప్రోత్సహించిన వారిని దోషులుగా నిర్ధారించడంలో విఫలమవుతున్నందున శిక్షల రేటు తగ్గుముఖం పడుతోంది.
రంగంలోకి సీఐడి..
ఈ నేపధ్యంలో ప్రభుత్వం సీరియస్‌గా పరిగణించినందున పోలీసుశాఖ నుంచి సీఐడి రంగంలోకి దిగింది. రాష్ట్రంలో వెట్టి చాకిరి నిర్మూలనకు ఆపరేషన్ స్వేచ్చ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సీఐడి చీఫ్ ఎన్ సంజయ్ ఈ ఆపరేషన్ స్వేచ్ఛను సీఐడి రాష్ట్ర ప్రధాన కార్యాలయం నుంచి ప్రారంభించారు. వెట్టి చాకిరీ వ్యవస్థను నిర్మూలించడానికి చట్ట పరమైన చర్యలు చేపట్టాలని అన్ని జిల్లాల ఎస్పీలను ఆదేశించారు. మరోవైపు అవగాహనా కార్యక్రమాల నిర్వహణకు కార్యాచరణ ప్రకటించారు. సీఐడి మహిళా సంర క్షణ విభాగం ఎస్పీ కేజీవి సరిత నేతృత్వంలో ఆపరేషన్ స్వేచ్ఛకు సంబంధించి రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆపరేషన్ స్వేచ్ఛ కార్యక్రమాన్ని వారం రోజుల పాటు ప్రతి జిల్లాల్లో గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పక్కాగా అమలు చేసేందుకు విజిలెన్స్ కమిటీలు ఏర్పాటు చేశారు.
ఆయా జిల్లాల ఎస్పీల నేతృత్వంలో ఇప్పటికే రెవెన్యూ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, హెల్త్, జిల్లా లీగల్ సర్వీస్ (ఒన్ స్టాప్ సెంటర్) అథారిటీ, దిశ పోలీస్ స్టేషన్, ఎన్జీవో సంఘాల వారితో సమావేశాలు నిర్వహిస్తున్నారు. నిరంతరం డ్రైవ్‌లు నిర్వహిస్తూ వెట్టి చాకిరి చేస్తున్న వారిని గుర్తించి వారిని రక్షించడం, అదేవిధంగా ప్రోత్సహిస్తున్న వారి పై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఉపక్రమించారు. దీనిలో భాగంగా ఈనెల 9, 10 తేదీల్లో నిర్వహించిన డ్రైవ్‌లో వివిధ కేసులు నమోదు చేయడం జరిగింది.
బాండెడ్ లేబర్ కింద గుర్తించిన అంశాలు ఇవే..
\రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న స్పెషల్ డ్రైవ్‌లో సీఐడి నేతృత్వంలోని జాయింట్ యాక్షన్ కమిటీలు వాంటెడ్ లేబర్ కింద పలు అంశాలు గుర్తించాయి. అత్యవసర పరిస్థితుల్లో విధిలేక తీసుకునే అప్పులకుగాను బానిసత్వంగా పనిచేసే తీరాల్సిందని నిర్బంధించడం. కనీస వేతనం కంటే మరింత తక్కువ మొత్తంలో వేతనం ముట్టచెప్పడం. ఆచార వ్యవహారాలు నిర్వహించాల్సిన సమయంలో సైతం కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లడానికి అనుమతించకపోవడం. శారీరక హింసకు గురవుతున్న పరిస్థితులు. సహాయం అందించేందుకు ఎవరూ లేని పరిస్థితి. ఆయా కుటుంబాలు సహాయం కోసం డివిజనల్ రెవెన్యూ అధికారిని ఆశ్రయించడం.