Tuesday, November 19, 2024

AP | అర్చకులు, సేవకులకు చుక్కెదురు.. సర్వీసు ఈనామ్‌ భూములకు మాత్రమే వర్తింపు

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని దేవాదాయ, ధర్మాదాయ శాఖకు చెందిన ఈనామ్‌ భూములు అనుభవిస్తున్న అర్చకులు తదితరులకు చుక్కెదురయ్యింది. ఎప్పటి నుంచో ఈనామ్‌ భూములను క్రమబద్దీకరించి హక్కులు రైత్వారీ హక్కులు కలిపిస్తారంటూ.. అర్చకులు, ఆలయాలు, ఛారిటీ సంస్థల్లో విధులు నిర్వహించే వారు ఆశించారు. పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తమ పేరిట క్రమబద్దీకరించాలని వినతి పత్రాలు సైతం అందజేశారు. ఇటీవల ప్రభుత్వం, మంత్రులు ఈనామ్‌ భూములను క్రమబద్దీకరించనున్నట్లు స్పష్టం చేయడంతో తిరిగి వీరిలో ఆశలు చిగురించాయి.

ఈ నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈనామ్‌ భూములను క్రమబద్దీకరిస్తూ జీవో 310ని జారీ చేసింది. ఆ ఉత్తర్వుల్లో సర్వీసు ఈనామ్‌ భూములను మాత్రమే క్రమబద్దీకరించిన ప్రభుత్వం..దేవదాయ, ఛారిటీ సంస్థలకు చెందిన ఈనామ్‌ భూములను మినహాయించింది. రాష్ట్రంలోని వివిధ ఆలయాలు, ధార్మిక సంస్థలకు చెందిన ఈనామ్‌ భూములు పెద్ద ఎత్తున ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో లక్షన్నర ఎకరాల వరకు ఈనామ్‌ భూములు ఉన్నట్లు అధికారులు చెపుతున్నారు. ఆలయాల్లో పని చేసే అర్చకులు, వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించే వారికి అప్పట్లో జమిందార్లు భూములను ఈనామ్‌గా ఇచ్చారు.

- Advertisement -

వాటిని సాగు చేసుకుంటూ క్రమేపీ అమ్మకాలు సైతం చేశారు. కొన్ని చోట్ల అర్చకులు, ఇతరుల ఆస్తులు కబ్జాలకు కూడా గురయ్యాయి. మరికొన్ని చోట్ల పేదల పేరిట ఈనామ్‌ భూములు ఆక్రమించుకొని సాగు చేసుకుంటున్నారు. అర్చకులు, నాదస్వర కళాకారులు, ఇతరుల పేరిట ఉన్న ఈనామ్‌ భూములను ఆయా వ్యక్తుల పేరిట క్రమబద్దీకరణ కోరుతూ ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. కొన్ని చోట్ల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని విక్రయాలకు అర్చకులు సిద్ధపడినప్పటికీ..చట్టంలోని నిబంధనల దృష్ట్యా సాధ్యపడటం లేదు.

సర్వీసు ఈనామ్‌ భూములకే..

రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు సర్వీసు ఈనామ్‌ భూములను క్రమబద్దీకరించేందుకు మాత్రమే పరిమితమైంది. గ్రామాల్లో క్షౌర వృత్తిదారులు, వడ్రంగి, కమ్మరి, కుమ్మరి, రజక వంటి చేతి వృత్తిదారులకు చెందిన గ్రామ సర్వీస్‌ ఈనామ్‌ భూములకు తాజా నిర్ణయంతో లబ్ధి చేకూరుతుంది. 1956లో ఇనామ్‌ చట్టం రావడంతో అప్పటి వరకు ఈనామ్‌ కింద ఉన్న భూములను రద్దు చేసి వారికి రైత్వారీ పట్టాలు ఇచ్చారు. 16/2013 ద్వారా సవరించిన ఆంద్రప్రదేశ్‌ ఈనామ్‌ (రద్దు, రైత్వారీగా మార్చడం) చట్టం 1956లోని నిబంధనలు గ్రామ కళాకారులు/గ్రామసేవ ఇనామ్కు వర్తించవని ప్రభుత్వం స్పష్టం చేసింది. వృత్తిదారులు, గ్రామ సేవా ఇనావ్లు విషయంలో ఇప్పటికే మంజూరు చేసిన రైత్వారీ పట్టాలు చెల్లుబాటు- అవుతాయని, అటు-వంటి పట్టాదారు వారి చట్టపరమైన వారసులు, కొనుగోలు దారులు అన్ని రెవెన్యూ రికార్డుల్లో పట్టాదారుగా నమోదు చేయబడతారంటూ ప్రభుత్వం అధికారులకు స్పష్టం చేసింది. కొందరు రైతులు తమ అవసరాల కోసం ఆయా భూములను అమ్ముకోగా, మరికొందరు వారసులకు ఆయా భూములును ఇచ్చారు.

చట్ట సవరణ..

ప్రభుత్వం 2013లో దేవాలయాలు, ధార్మిక సంస్థలకు ఇచ్చిన ఈనామ్‌ భూములను ఉద్దేశించి చట్ట సవరణ చేశారు. 2013లో చేసిన చట్టం ప్రకారం సేవలను కొనసాగించినన్ని రోజులు మాత్రమే ఈనామ్‌ భూములపై వచ్చే ఫలసాయాన్ని అనుభవించేందుకు వీలుంటుంది. ఇందుకు అనుగుణంగా దేవాదాయ భూములను 22 (ఎ)లో పొందుపరిచారు. ఇదే సందర్భంలో గ్రామాల్లో చేతి వృత్తులు చేసుకుని జీవనం సాగిస్తున్న వారి ఈనామ్‌ భూములను కూడా అందులో చేర్చారు. ఇప్పుడు వీటిని ప్రభుత్వం క్రమబద్దీకరించడంతో 1,68,603.71 ఎకరాలు నిషేధిత జాబితానుంచి విముక్తి కలుగుతుంది. ప్రభుత్వం చేపట్టిన భూముల రీసర్వే సమయంలో గ్రామ సేవా ఈనామ్‌లు, వారికి మంజూరైన రైత్వారీ పట్టాదారుల నుంచి భూములను కొనుగోలు చేసిన పలువురు- రైతుల నుంచి ఫిర్యాదులందాయి. తమ పేర్లను రెవెన్యూ అధికారులు రికార్డుల్లో నమోదు చేయడం లేదని వీరంతా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఈనేపథ్యంలో ప్రభుత్వం సర్వీస్‌ ఈనామ్‌ భూములను క్రమబద్దీకరిస్తూ నిర్ణయం తీసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement