Saturday, September 7, 2024

White Paper – జగన్ పాలనలో శాంతి భద్రతలు విధ్వంసం – ప్రజాస్వామ్యం అపహాస్యం – చంద్రబాబు

గ‌త ప్ర‌భుత్వంలో ఎవ్వరినీ వదల్లేదు
జీవో నెంబర్ వన్ తో సంకెళ్లు వేశారు
నాపై 17 కేసులు పెట్టారు
జేసీ ప్రభాకర రెడ్డిపై 60 కేసులు
రఘురామపై చిత్రహింసలు
ఆ వీడియోలు చూసి అప్పటి సీఎం నవ్వుకున్నారు
ఇక తప్పుడు రాజకీయాలు సహించం
శాంతిభద్రతలపై బాబు శ్వేతపత్రం విడుదల

ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి : తప్పుడు రాజకీయాలను సహించమని ఏపీ సీఎం చంద్రబాబు వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. శాంతిభద్రతలపై అసెంబ్లీలో ఆయన శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, టీడీపీ, జనసేన కార్యాలయాలపై దాడులు చేశారని, జై జగన్‌ అనలేదని తోట చంద్రయ్యను దారుణంగా చంపారని, ఇప్పుడు శాంతిభద్రతలు విఫలమయ్యాయని వైసీపీ నాయకులు ఢిల్లీలో నిరసన తెలుపుతున్నారని చంద్రబాబు స్పష్టం చేశారు. లా అండ్‌ ఆర్డర్‌ ను సక్రమంగా నిర్వహించడం ఎన్డీయే ప్రభుత్వం బాధ్యతని, తప్పుడు రాజకీయాలు చేస్తే సహించమన్నారు.

- Advertisement -

ప్ర‌తిప‌క్షాల‌ను నియంత్రించేందుకే ఆ జీవో..

ప్రతిపక్ష పార్టీల కార్యకలాపాలను నియంత్రించడానికే జీవో 1 తీసుకొచ్చారని, పులివెందులలో పోటీ చేసిన రవీంద్రనాథ్‌పై కేసుపెట్టి జైలులో పెట్టారని, సంగం డెయిరీలో అక్రమాలు జరిగాయంటూ ధూళిపాళ్లను జైలులో పెట్టారని, ప్రభుత్వాధికారులపై దాడి చేశారని కూన రవికుమార్‌పై కేసులు పెట్టారని చంద్రబాబు వివరించారు. ఇక మహిళా నేతలపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టారని, పర్నీచర్‌ దుర్వినియోగం చేశారని కోడెల శివప్రసాదరావుపై 18 కేసులు పెట్టారని, ఈ అవమానంతో బతకలేనని కోడెల ఆత్మహత్యకు పాల్పడ్డారనిఆవేదన వ్యక్తం చేశారు. నాటి సీఎం ఇంట్లో ఇప్పుడు కూడా ప్రభుత్వ ఫర్నీచర్‌ ఉందని సీఎం చంద్రబాబు ఆరోపించారు.

అప్ప‌ట్లో ఎవ్వరినీ వదల్లేదు

వంగలపూడి అనితపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారని, అయ్యన్నపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, అత్యాచార యత్నం కేసులు పెట్టారని సీఎం చంద్రబాబు వివరించారు. ఇక అచ్చెన్ననాయుడుపై కక్ష తీర్చుకున్నారని, ఆరోగ్యం సరిగా లేకపోయినా 600 కి.మీ వాహనంలో తిప్పారని, సంబంధం లేకపోయినా ప్రశ్నాపత్రం లీకైందని నారాయణపై కేసుపెట్టారని , ఇక ఎదురించినందుకు రఘురామను లాకప్‌లో చిత్రహింసలు పెట్టారని, ఈ వీడియో చూసి నాటి సీఎం పైశాచిక ఆనందం పొందారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయిదేళ్లు సొంత నియోజకవర్గానికి ఎంపీ రఘురామ వెళ్లకుండా చేశారని, ఎంపీ రఘురామకు సొంత నియోజకవర్గంలో కూడా భద్రత లేని పరిస్థితిని కల్పించారని సీఎం చంద్రబాబు అన్నారు. గత పాలనలో మానసికంగా, శారీరకంగా మనోవేదన పడ్డారని, పోలీసుల అండతో ప్రజాస్వామ్య పునాదులపై దాడులు చేశారని, చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మూడు రాజ‌ధానుల బిల్లుపై దురుసుత‌నం..

శాసన మండలిలో 3 రాజధానుల బిల్లు విషయంలో దుర్మార్గంగా ప్రవర్తించారని, మండలి ఛైర్మన్‌ పనిచేయకుండా చేసి గొడవపడ్డారని, గత పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యమైందన్నారు. ప్రభుత్వ కక్షసాధింపు చర్యలకు పోలీసులు ఆయుధంగా మారారని పోలీసులు వైఎస్సార్సీపీ నేతలతో కుమ్మక్కై నిబంధనలు ఉల్లంఘించారని, వైసీపీ నేతలతో విభేదిస్తే పోస్టింగ్‌లు నిలిపి, . వీఆర్‌లో ఉంచారని , అయిదేళ్లపాటు వీఆర్‌లోనే అధికారులుఉన్నారని, పోలీసు వ్యవస్థను పూర్తిగా విధ్వంసం చేశారని సీఎం స్పష్టం చేశారు. బాబ్లీ కేసు తప్ప నాపై గతంలో ఎప్పుడూ కేసులు లేవు, వైసీపీ అధికారంలోకి వచ్చాక నాపై 17 కేసులు పెట్టారు, పవన్‌ కల్యాణ్‌పై ఏడు కేసులు పెట్టారు, ప్రతిపక్ష నేతలను అణచివేసేందుకు యత్నించారు, జేసీ ప్రభాకర్‌ రెడ్డిపై ఎక్కువగా 60కి పైగా కేసులు పెట్టారు, పల్లా శ్రీనివాసరావుఇంటిని కూల్చివేశారు, అదే పల్లా శ్రీనివాసరావుకు రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ వచ్చిందని సీఎం చంద్రబాబు అన్నారు.

అయిదు అంశాల శ్వేత పత్రం

మొత్తం అయిదు అంశాలుగా శ్వేతపత్రాన్ని విభజించామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు శాంతి భద్రతలను చాలా చక్కగా మెయింటెయిన్ చేశారన్నారు.గతంలో రాయలసీమలో ఫ్యాక్షనిజాన్ని కంట్రోల్ చేశామని చెప్పారు. సీమలో ఫ్యాక్షనిజం లేకుండా చేయాలని చూశామని.. ఆ క్రమంలో చివరకు తమ పార్టీ సీనియర్ ఎమ్మెల్యేలు ఇద్దరిని అరెస్ట్ చేసిన తర్వాత మిగిలిన వారిని అదుపులోకి తీసుకున్నామన్నారు. తద్వారా రాయలసీమలో ఫ్యాక్షనిజం లేకుండా చేశామని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. హైదరాబాద్‌లో మత ఘర్షణలను ఉక్కుపాదంతో అణిచి వేశామన్నారు. దీంతో మత సామరస్యానికి వేదికగా హైదరాబాద్‌ను నిలిపామని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు.. వామపక్ష తీవ్రవాదాన్ని సైతం గ్రేహౌండ్స్ ద్వారా అదుపులోకి తీసుకు వచ్చే ప్రయత్నం చేశామన్నారు. ఇక రాష్ట్రంలో ఎక్కడైనా రౌడీయిజం కనిపిస్తే.. దానిని సైతం ఉక్కుపాదంతో అణిచి వేశామని తెలిపారు. తమ ప్రభుత్వం చర్యల వల్ల ప్రజల్లో భద్రత పెరిగి ప్రతి ఒక్కరిలో ఓ నమ్మకం అయితే వచ్చిందన్నారు. సాంకేతిక పరిజ్జానాన్ని ఉపయోగించుకోని శాంతి భద్రతలను కాపాడామని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా సోదాహరణగా వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement